• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • 14 KGS GOLD FOUNDED IN RTC BUS IN KARNOOL DISTRICT NGS

Andhra Pradesh: ఆర్టీసీ బస్సులో 14 కిలోల బంగారం: ఎలా దొరికిందో తెలుసా?

ఆర్టీసీ బస్సులో 14.8 కిలోల బంగారం రవాణా

ఏపీలో అక్రమ బంగారం రవాణ ఆందోళన పెంచుతోంది. ఇటీవల పోలీసుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడుతోంది. పోలీసుల పటిష్ట నిఘా ఉండడంతో పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు ఈ సారి ఆర్టీసీ బస్సులో భారీగా బంగారం తరలిస్తూ పట్టుబడ్డాడు ఓ వ్యక్తి.

  • Share this:
    ఏపీలో బంగారం అక్రమ రవాణా రోజు రోజుకూ పెరుగుతోంది. ఇటీవల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడుతోంది. తాజాగా మరోసారి అక్రమ బంగారం కలకలం రేపింది. బస్సులో తరలిస్తున్న 14.8 కిలోల బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు. కర్నూలు జిల్లా పంచాలింగాల వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా బంగారం పట్టుబడింది. అయితే ఆ బంగారాన్ని ఒక ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడి వద్ద  దొరకడంతో అంతా షాక్ కు గురయ్యారు. అంత బంగారాన్ని ఆర్టీసీ బస్సులో తరలించడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. బస్సులో ఉన్నవారైతే అంత బంగారాన్ని ఎప్పుడూ చూడలేదంటూ నోరెళ్లబెట్టారు.

    ఒక బ్యాగ్ తో వెళ్తున్న ఆ వ్యక్తిపై అనుమానం రావడంతో పోలీసులు తనిఖీలు చేయగా.. ఆ ప్యాసింజర్ నుంచి 14.8 కిలోల బంగారం పట్టుబడింది. తెలంగాణ నుంచి కర్నూలు వెళ్తున్న బస్సు ఆపి తనిఖీ చేయగా రాజు అనే వ్యక్తి వద్ద ఉన్న బ్యాగును చెక్‌పోస్ట్ పోలీసులు తనిఖీ చేశారు. దీంతో అతన్ని నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు.

    అనంతపురం జిల్లా తాడిపత్రిలోని రాయలసీమ బులియన కమ్ ట్రేడ్ ప్రైవేటు లిమిటెడ్ నగల దుకాణంలో రాజు పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తన యాజమాని రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని ఓ దుకాణంలో నుంచి బంగారం తరలిస్తున్నట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు. అయితే వాటికి సరియైన పత్రాలు కానీ, ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేసి బంగారాన్ని సీజ్ చేశామని పోలీసులు చెబుతున్నారు.

    ఆర్టీసీ బస్సులో బంగారం తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం ఉండడంతోనే నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ బంగారాన్ని నిజంగానే షాపు యజమాని అక్రమ మార్గంలో తరలిస్తున్నారా? లేక బంగారాన్ని తరలించే వ్యక్తి చోరీ చేసి తీసుకువస్తున్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే తమకు సమాచారం ఇచ్చిన వ్యక్తి ఎవరు.. ఏవైనా లావాదేవీల్లో తేడా వచ్చి పట్టించే ప్రయత్నం చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

    కర్నూలు ఎస్ఈబి అధికారులు తనిఖీలతో ఇంత భారీ బంగారం బయటపడింది. దొరికిన బంగారంలో ఆభరణాలు లేవు. మొత్తం 14.8 కేజీలు బంగారపు బిస్కెట్లే కావడంతో అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ బంగారం విలువను 6.86 కోట్ల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ నుండి కడపకు ఈ బంగారపు బిస్కెట్లు తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు మాత్రం వ్యాపారం కోసమే తరలిస్తామని చెబుతున్నా.. అందుకు సరైన ఆధారాలు చూపించకపోవడంతో కర్నూలు తాలుకా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు వీటిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
    Published by:Nagesh Paina
    First published: