నేను అన్నయ్యను కాదు.. మావయ్యనవుతా అంటూ బాలిక నోట్లో గుడ్డలు కుక్కి ఎత్తుకెళ్లి మూడు గంటలపాటు అత్యాచారంచేసి, ఆమె నగ్న వీడియోలు చిత్రీకరించి, ఆమె తల్లి, సోదరిల నగ్న వీడియోలు కూడా తీసివ్వాలంటూ బెదిరించాడు. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలంలో దారుణం..
'అన్నయ్యా.. ప్లీజ్ నన్ను వదిలెయ్..' అని రోదిస్తూ వేడుకున్నా కనికరించలేదు ఆ రాక్షసుడు..! అన్నయ్యను కాదు.. మావయ్యనవుతానంటూ ఆమె మీదపడ్డాడు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా భావిస్తోన్న విశాఖపట్నం జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. 11ఏళ్ల బాలికపై 22 ఏళ్ల యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమె నగ్న వీడియోలు చిత్రీకరించి విషయం బయటికి చెప్పొద్దని బెదిరించాడు. బాలిక తల్లి, సోదరివి కూడా నగ్న వీడియోలు తీసివ్వాలని ఆదేశించాడు. ఆద్యాంతం వికృతంగా సాగిన ఈ కీచకపర్వం స్థానికంగా సంచలనం రేపింది. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే రాజయ్యపేటలో గురువారం రాత్రి చోటుచేసుకుందీ ఘటన. బాధితురాలికి అండగా ప్రతిపక్ష టీడీపీ ఆందోళనలకు దిగింది. నక్కపల్లి పోలీస్ స్టేషన్ నారాయణరావు మీడియాకు చెప్పిన వివరాలివి..
విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామానికి చెందిన పదకొండేళ్ల బాలిక ఆరో తరగతి చదువుతోంది. గురువారం సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక.. సమీపంలోని తోటలో వంటచెరకు కోసం వెళ్లిన అక్క వద్దకు బయల్దేరి వెళ్లింది. మార్గమధ్యంలోని జీడితోటలో అదే గ్రామానికి చెందిన గొడ్డు నాగేశ్ (22) ఆమెను పట్టుకుని నోట్లో గుడ్డలు కుక్కి, దూరంగా లాక్కెళ్లాడు. సెల్ఫోన్లో అశ్లీల వీడియోలు చూడాలని ఒత్తిడి చేశాడు. ఆమె అంగీకరించకపోవడంతో దారుణంగా కొట్టాడు. కత్తితీసి బెదిరించి నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆపై అత్యాచారం చేశాడు. సుమారు మూడు గంటలపాటు హింసించాడు.
అంతేగాకుండా బాలిక తల్లి, అక్క స్నానం చేసేటప్పుడు వీడియోలు తీసి తనకు పంపాలని ఆ బాలికను ఆదేశించాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని పలుమార్లు కత్తి చూపించి బెదిరించాడు. ఎవరికీ చెప్పనని కాళ్లమీద పడ్డాక రాత్రి 8 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చి ఆమె ఇంటి సమీపంలో దింపేసి వెళ్లిపోయాడు. బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు చెప్పారు. భయంతో వణికిపోతూ ఇంటికొచ్చిన ఆ బాలికను చూసిన తల్లిదండ్రులు ఓదార్చుతూ.. విషయం రాబట్టడంతో ఈ దారుణం వెలుగుచూసింది. వెంటనే బంధువులంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో బాలికపై అత్యాచార ఉదంతం రాజకీయంగానూ రచ్చకు దారితీసింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆందోళనలకు దిగారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత నేరుగా బాధిత కుటుంబాన్ని కలుసుకుని ఓదార్చారు. జగన్ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండాపోయిందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని నక్కపల్లి పోలీసులు చెప్పారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.