Hyderabad: ఊయలే పదేళ్ల బాలిక ఉసురు తీసింది.. అందులో ఆడుకుంటూనే శాశ్వతంగా నిద్రపోయింది..!

మనస్వినితో తల్లిదండ్రులు, తమ్ముడు (ఫైల్ ఫొటో)

రోజూ ఆడుకునే ఊయలే ఆ పదేళ్ల బాలిక ప్రాణాల్ని తీసింది. ఆడుతూ ఆడుతూనే ఊయలలోనే ఆ పాప ఊపిరి ఆగిపోయింది. పాప గొంతునకు చీర ఊయల బిగుసుకోవడంతో ఘోరం జరిగింది.

  • Share this:
    పాపం.. ఆ పాపకేం తెలుసు రోజూ ఆడుకునే ఊయలే తన ఉసురు తీస్తుందని. హాయిగా రోజూ పడుకునే ఊయలలోనే శాశ్వతంగా నిద్రపోతుందని. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్లారు. ఇంట్లో నాయనమ్మ నిద్రపోతోంది. తనను ఆడించేవాళ్లు లేక తానే ఆటాడుకుందామనుకుంది. ఇంట్లో అమ్మ చీరతో కట్టిన ఉయ్యాలతో ఆటలాడసాగింది. ఉయ్యాలలో కూర్చుని గుండ్రంగా తనకు తాను చుట్టుకోసాగింది. కొద్ది సేపటి తర్వాత వదిలేస్తే గుండ్రంగా ఉయ్యాల తిరగసాగింది. అది సరదాగా అనిపించిందేమో, అదే పనిగా ఆ ఆటను ఆడుకుంది. కానీ అదే ఆట ఆమె ప్రాణాన్ని తీసింది. చీర ఉయ్యాల ఆమె గొంతుకు బిగుసుకుపోయింది. ఊపిరి ఆడకపోవడంతో ఆ బాలిక మరణించింది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    హైదరాబాద్ లోని నాచారంలో మజీద్‌బాబానగర్‌లో ఒల్లూరి రమేష్ తన భార్య, పదేళ్ల కుమార్తె మనస్విని, ఎనిమిదేళ్ల కుమారుడు, తన తల్లి ఉమారాణితో కలిసి నివసిస్తున్నాడు. భార్యాభర్తలిద్దరూ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కొడుకు పుట్టినప్పటి నుంచి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో వైద్య చికిత్సను అందిస్తూనే ఉన్నారు. కూతురు మనస్విని హబ్సీగూడలోని బ్రిలియంట్ గ్రామర్ స్కూలులో నాలుగో తరగతి చదువుకుంటోంది. ఈ క్రమంలోనే రోజూ లాగానే గురువారం ఉదయం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్లారు. ఉమారాణి ఇంట్లో నిద్రపోతోంది. బాబు కూడా నిద్రపోతున్నాడు.
    ఇది కూడా చదవండి: నిర్మానుష్య ప్రాంతంలో ఏకాంతంగా ఓ వివాహితతో ఉన్న కుర్రాడికి షాకింగ్ అనుభవం.. పోలీసు శాఖలోనూ కలకలం.. అసలేం జరిగిందంటే..!

    ఇంట్లోనే ఉన్న మనస్వినికి నిద్రపట్టలేదేమో, ఆడుకోవాలని చూసింది. పిల్లలు కూడా ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఇంట్లోనే చీర ఉయ్యాలతో ఆడుకోసాగింది. అందులో కూర్చుని గుండ్రంగా తిరుగతూ నవ్వుతూ ఆటాడుకోసాగింది. కానీ ఆ చీరే ఆ బాలిక ప్రాణాన్ని తీసింది. చీర ఉయ్యాల ఆ బాలిక గొంతునకు బిగుసుకుపోయింది. ఊపిరి ఆడక ఆ బాలిక మరణించింది. నిద్ర లేచిన ఆ బాలిక నాయనమ్మ ఉయ్యాలలో మనస్విని చనిపోయి కనిపించింది. ఆమె కేకలను విని స్థానికులు ఘటన స్థలానికి వచ్చారు. బాలిక మెడ నుంచి చీరను వేరు చేశారు. ఈ ఘటన గురించి తెలిసి తల్లిదండ్రులు హుటాహుటిన ఇంటికి వచ్చారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Hasaan Kandula
    First published: