సామాజిక మాధ్యమాలలో సరదాకు విసురుకున్న సవాళ్లు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. అంతకుముందు పలు చాలెంజ్ లు తీసుకుని పలువురు మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. తాజాగా.. టిక్టాక్ లో బ్లాక్ అవుట్ చాలెంజ్ అనేది ట్రెండింగ్ లో ఉంది. దీనిని స్వీకరించిన ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఇటలీలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. ఇటలీలోని పలెర్మోకు చెందిన పదేళ్ల బాలికకు టిక్ టాక్ లో ఎవరో బ్లాక్ అవుట్ చాలెంజ్ విసిరారు. దీంతో ఆ బాలిక ఆ చాలెంజ్ ను స్వీకీరించింది.
బ్లాక్ అవుట్ చాలెంజ్ అంటే.. ఊపిరితీసుకోకుండా కొంత సమయం ఉండటం. అయితే ఈ చాలెంజ్ ను స్వీకరించిన సదరు బాలిక.. మెడ దగ్గర బెల్ట్ తో కట్టుకుంది. కొద్దిసేపటికే ఆమెకు కార్డియాక్ అరెస్టు (గుండెపోటు) వచ్చి మూర్చపోయింది. ఇది చూసిన ఆమె తల్లిదండ్రులు ఆ బాలికను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో వైద్యులు కూడా ఆ పాపను కాపాడలేకపోయారు. తాము చేయగలిగిందంతా చేశామని.. కానీ పాపను బ్రతికించలేకపోయామని వారు చెప్పుకొచ్చారు.
ఇదిలాఉండగా.. పాప చనిపోయిన తర్వాత ఆమె తల్లిదండ్రులు తన అవయవాలను దానం చేయడం గమనార్హం. బ్లాక్ అవుట్ చాలెంజ్ కంటే ముందు ఆన్లైన్ లో బ్లూ వేల్ చాలెంజ్ వంటి ఆటలు కూడా ప్రమాదకరంగా మారాయి. వీటి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, International news, Italy, Tiktok