Zomato: టీ20 వరల్డ్ కప్ 2022(T20 World Cup Win)లో భాగంగా గురువారం పెర్త్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్(Pakistan)పై జింబాబ్వే ( Zimbabwe)జట్టు ఒక్క పరుగు తేడాతో గెలిచి సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్‌లో పాక్ బౌలర్లను జింబాబ్వే ప్లేయర్లు ఒక ఆట ఆడుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 రన్స్ చేసింది. అనంతరం బౌలింగ్‌లో పాక్ ప్లేయర్లను కట్టడి చేసి 1 పరుగుతో విజయాన్ని నమోదు చేసింది. కాగా ఈ ఓటమి తర్వాత పాక్‌పై ఎన్నడూ లేని విధంగా ట్విట్టర్లో ట్రోల్స్ వస్తున్నాయి. దీనికి కారణం ఫేక్ మిస్టర్ బీన్ అని చెప్పవచ్చు. తాజాగా జొమాటో కూడా ఈ ఫేక్ బీన్ పేరు వాడుతూ పాక్‌ను ట్రోల్ చేసింది. అసలు ఈ మ్యాచ్‌కి, ఫేక్ మిస్టర్ బీన్‌కి సంబంధం ఏంటంటే..
ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే.. 2016లో హరారే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌కు పాకిస్థానీ హాస్యనటుడు ఆసిఫ్ మొహమ్మద్ వెళ్లాడు. ఇతడు అసలైన మిస్టర్ బీన్(రోవాన్ అట్కిన్సన్)ను పోలి ఉంటాడు. అందుకే అతన్ని 'పాకిస్థానీ మిస్టర్ బీన్' అని పిలుస్తుంటారు. అయితే, ఒక్కో జింబాబ్వే వ్యక్తి 10 డాలర్లు వెచ్చించి ఇతన్ని, కామెడీ షోను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జోక్ ఏంటంటే, ఈ షో అట్టర్ ఫ్లాప్ అయింది. హాయిగా మిస్టర్ బీన్ కామెడీ షో చూసి నవ్వుకోవచ్చని ఎంతో ఆశతో వచ్చిన వారు నిరాశగా వెనుదిరిగారు. అప్పట్లో కొందరు పాక్‌పై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఫేక్ మిస్టర్ బీన్ని పంపించి తమను దారుణంగా మోసం చేశారంటూ వారు ఫైర్ అయ్యారు.
కాగా అప్పుడు పాక్ మోసం చేయడానికి గుర్తు చేసుకుంటూ ఈ మ్యాచ్‌కు ముందు ఒక ట్విట్టర్ యూజర్ శాపం పెట్టారు. 'న్గుగి చసుర' అనే పేరుతో ఉన్న ట్విట్టర్ యూజర్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ట్యాగ్ చేస్తూ.. “జింబాబ్వే ప్రజలుగా మేం మిమ్మల్ని క్షమించం. ఎందుకంటే మీరు ఒకసారి మాకు మిస్టర్ బీన్ బదులుగా ఆ ఫ్రాడ్ పాక్ బీన్‌ను పంపించారు. రేపు ఈ విషయం సెటిల్ చేస్తాం. వర్షం మిమ్మల్ని కాపాడాలని వేడుకోండి." అని ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఆ వ్యక్తి అన్నట్లుగానే జింబాబ్వే గురువారం విజయం సాధించి, 2016లో తమను మోసం చేసినందుకు ప్రతీకారం తీర్చుకుంది.
Putin : భారత అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది..మోదీ నాయకత్వంపై పుతిన్ ప్రశంసలు
జొమాటో ట్రోలింగ్
జింబాబ్వే అధ్యక్షుడు ఎమ్మెర్సన్ మ్నాంగాగ్వా కూడా పాక్‌ని ట్రోల్ చేశారు. అధ్యక్షుడు ట్వీట్ చేస్తూ, “జింబాబ్వే.. వాట్ ఎ విన్! ప్లేయర్లకు అభినందనలు. నెక్స్ట్ టైమ్ అయినా, నిజమైన మిస్టర్ బీన్‌ను పంపండి." అని పాక్‌ని ఎగతాళి చేశారు.
ఈ నేపథ్యంలో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో కూడా బీన్ గురించి ప్రస్తావిస్తూ తనదైన శైలిలో పాకిస్థాన్‌ను వెక్కిరించింది. "బీన్స్ నిజమైన మ్యాచ్ విన్నింగ్ ఫుడ్." అని ఇన్‌డైరెక్ట్‌గా పాక్‌పై వ్యంగ్యాస్త్రాలు విసిరింది. కాగా ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. చాలామంది నెటిజన్లు జొమాటో ట్వీట్ చూసి నవ్వుకుంటున్నారు. ఇది మామూలు రోస్టింగ్ కాదు, పాక్ టీమ్ ఇప్పుడు బీన్స్ మాత్రమే ఆర్డర్ చేస్తుందేమో అని ఫన్నీగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.