కరోనా మహమ్మారిని అరికట్టే పోరాటంలో భాగంగా అందుకు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలు కోసం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ. 10 లక్షలు విడుదల చేశారు. ఈ మొత్తాన్ని విశాఖపట్నం జిల్లాకు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. నిధుల విడుదలకు సిఫార్సు చేస్తూ ఆయన విశాఖ జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కరోనా అనుమానిత వ్యక్తుల శరీర ఉష్ణోగ్రతను దూరం నుంచే పరీక్షించేందుకు అవసరమైన ఇన్ఫ్రా-రెడ్ థర్మోమీటర్లు, పర్సనల్ ప్రొటెక్షన్ కిట్లు, ఇతర వైద్య పరికరాల కొనుగోలు కోసం ఈ నిధులను మంజూరు చేస్తున్నట్లుగా ఆయన తన లేఖలో తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అసాధారణ చర్యలలో భాగంగా కరోనా పరీక్షల కోసం తగినన్ని వైద్య పరికరాలతో సిద్ధంగా ఉండాలన్న ఉద్ధేశంతో వాటి కొనుగోలు కోసం ఎంపీ నిధులను వినియోగించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. వీటికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తూ కేంద్ర స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ విజయసాయిరెడ్డికి లేఖ రాసింది. దీనిపై ఆయన వెంటనే స్పందిస్తూ విశాఖ జిల్లాలో కరోనా పరీక్షల కోసం వైద్య పరికరాల కొనుగోలుకు తన ఎంపీ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ విశాఖ జిల్లా కలెక్టర్కు సిఫార్సు లేఖ రాశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Coronavirus, Covid-19, Vijayasai reddy, Visakhapatnam