ఆంధ్రప్రదేశ్ నుంచి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయే వలస కూలీలకు కూడా చేతి ఖర్చులకు డబ్బులు ఇచ్చి పంపాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ, వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏపీకి చెందిన వలస కూలీలు, అలాగే రాష్ట్రంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వలసకూలీలల తరలింపు విధానాలపై అధికారులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్చించారు. విదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఏపీకి దాదాపు 1.5లక్షల మంది వచ్చే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. వలసకూలీల విషయంలో ఉదారంగా ఉండాలని అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు. ఏపీలో ఉన్న ఇతర రాష్ట్రాల కూలీలకు షెల్టర్ ఏర్పాటుచేసి వారికి భోజనం, తదితర సదుపాయాలు ఇవ్వాలన్నారు. వివిధ పరిశ్రమల్లో పనులకు వెళ్తానంటే.. వారికి సహకారం అందించాలని సూచించారు. ఒకవేళ తమ తమ రాష్ట్రాలకు వెళ్లిపోతామంటే... వారికి కావాల్సిన ప్రయాణ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనికి అవసరమైన ఖర్చను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, ఈవిషయంలో సంకోచించాల్సిన అవసరం లేదన్నారు. అలాగే, వలస కూలీలు వెళ్లేటప్పుడు దారి ఖర్చుల కింద రూ.500లు ఒక్కో కూలీకి ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏపీకి చెందిన కూలీలు రాష్ట్రానికి వచ్చేందుకు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు ముందుకురాని పరిస్థితులు ఉంటే.. వెనకడుగు వేయవద్దన్నారు. అవసరమైన పక్షంలో వారికీ ప్రయాణ సదుపాయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాలన్నారు.
విదేశాల నుంచి వచ్చేవారు ఆమూడు ఎయిర్‌పోర్టులకు..
విదేశాల నుంచి విమానాల్లో వచ్చేవారు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టులకు చేరుకుంటారని అధికారులు తెలిపారు. వారికి అక్కడే మెడికల్ స్క్రీనింగ్ చేయిస్తామని చెప్పారు. మార్గదర్శకాల ప్రకారం వారిని క్వారంటైన్ చేసి పర్యవేక్షణ చేస్తామని వెల్లడించారు. ఆ తర్వాతే వారిని స్వస్థలాలకు పంపిస్తామని చెప్పారు. విదేశాలనుంచి వస్తున్న వారిలో ఆయా దేశాల్లో కరోనా తీవ్రత ఆధారంగా వారిని వర్గీకరిస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న వారికి కూడా క్వారంటైన్ సదుపాయాలపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
మహారాష్ట్రలోని థానే నుంచి 1000 మందికిపైగా వలసకూలీలు గుంతకల్ వచ్చారని అధికారులు తెలిపారు. వీరందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. థానేలో కేసుల తీవ్రత అధికంగా ఉందని, వీరిని పర్యవేక్షించాల్సి ఉందన్నారు. సరిహద్దుల్లో 9 చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని, పోలీసులు, వైద్య బృందాలు సమన్వయం చేసుకుంటాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Coronavirus