YOUNG HEALTH PEOPLE MIGHT NOT GET SHOTS OF CORONAVIRUS VACCINE UNTIL 2022 WHO BA
Corona Vaccine: కరోనాకి వ్యాక్సిన్ వచ్చినా 2022 వరకు వీళ్లకు మాత్రం వెయ్యరు
ప్రతీకాత్మక చిత్రం
‘కరోనాకి వ్యాక్సిన్ రాగానే మొదట హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఇవ్వాలనే అంశాన్ని చాలా మంది అంగీకరిస్తారు. కానీ, మనం ఇంకా గుర్తించాల్సిన అంశం ఒకటుంది.’
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం ప్రపంచంలో పలు క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అవన్నీ పూర్తవ్వడానికి మరికొన్ని రోజులు, నెలలు పట్టే అవకాశం ఉంది. ఈ కరోనాకి వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. అయితే, ఒకవేళ కరోనా వ్యాక్సిన్ వచ్చినా సరే కొందరికి మాత్రం 2022 వరకు వెయ్యరు. ఈ విషయాన్ని ఎవరో ఆషామాషీ వ్యక్తులు చెప్పలేదు. సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ చెప్పారు. కరోనాకి వ్యాక్సిన్ రాగానే మొదట హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్, ఆ తర్వాత కరోనా ప్రమాదం ఎక్కువగా ఉండే వారికి (వృద్ధులు, చిన్న పిల్లలు) మాత్రమే తొలిదశలో వ్యాక్సిన్ వేస్తారు. యువకులు, ఆరోగ్యంగా ఉన్నవారికి 2022 వరకు కరోనా వ్యాక్సిన్ వేయకపోవచ్చు. అయితే, ఎవరికి ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ, దానికి సలహాలు ఇచ్చే కొన్ని సంస్థలు త్వరలో నిర్ణయిస్తాయి. ‘జనవరి 1కి కరోనాకి వ్యాక్సిన్ వచ్చేస్తుంది. లేకపోతే ఏప్రిల్ 1కి వ్యాక్సిన్ వచ్చేస్తుంది. టీకా వేసేసుకుంటే చాలు. ఇక జీవితం మామూలు అయిపోతుంది. భయపడాల్సిన పనిలేదు.’ అని ప్రజలు భావిస్తున్నారు. కానీ, ఆ రకంగా జరగదని సౌమ్య స్వామినాథన్ చెప్పారు.
2021 నాటికి కనీసం ఒక్కటైనా క్షేమకరమైన, ఫలితాన్ని ఇచ్చే వ్యాక్సిన్ లభిస్తుందని ప్రపంచం మొత్తం ఆశగా ఎదురుచూస్తోంది. అయితే, అది పరిమిత స్థాయిలోనే అందుబాటులో ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 10 కరోనా వైరస్ వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయి. అందులో ఏ వ్యాక్సిన్ ఎవరి మీద ఎక్కువగా ఫలితాలను ఇస్తుంది? ఎవరికి బాగా పనిచేస్తుందనే అంశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభిస్తారని సౌమ్య స్వామినాథన్ తెలిపారు.
‘కరోనాకి వ్యాక్సిన్ రాగానే మొదట హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఇవ్వాలనే అంశాన్ని చాలా మంది అంగీకరిస్తారు. కానీ, మనం ఇంకా గుర్తించాల్సిన అంశం ఒకటుంది. వారిలో కూడా ఎవరు అత్యధికంగా కరోనాకి గురయ్యే ప్రమాదంలో ఉన్నారనేది గుర్తించాలి. ఆ తర్వాత వృద్ధులు, ఆ తర్వాత ఇతరులు ఇలా ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ వేయాలి’ అని ఆమె చెప్పారు. చాలా మంది నుంచి సలహాలు సూచనలు వస్తున్నాయని, ఓ సగటు వ్యక్తి, ఆరోగ్యంగా ఉన్న వారు, యువకులకు 2022 వరకు కరోనా వ్యాక్సిన్ లభించకపోవచ్చని WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అభిప్రాయపడ్డారు.