World Pangolins Day : కరోనా సోకడానికి ఈ మూగజీవే కారణమా?

World Pangolins Day : ప్రపంచంలో అరుదైన, అందమైన జీవిల్లో పాంగోలిన్ ఒకటి. దీన్నే ఆలుగు అని కూడా అంటారు. కరోనా వైరస్ సోకుతుండటానికి ఈ జీవి కూడా కారణమనే ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత?

news18-telugu
Updated: February 15, 2020, 1:12 PM IST
World Pangolins Day : కరోనా సోకడానికి ఈ మూగజీవే కారణమా?
చైనాలో వన్యమృగాల వాడకంపై శాశ్వత నిషేధం... (credit - twitter - Miniver Cheevy)
  • Share this:
World Pangolins Day : ఈ రోజు ప్రపంచ పాంగోలిన్స్ డే. ఈ సందర్భంగా మనం కొన్ని ఆసక్తికర, ఆశ్చర్యకర విషయాల్ని తెలుసుకుందాం. ప్రపంచంలో మనుషుల అక్రమ రవాణా తర్వాత అత్యంత ఎక్కువగా అక్రమ రవాణా అవుతున్నది ఎవరో తెలుసా... ఈ పాంగోలినే. చీమల్ని తింటూ బతికే ఈ జీవిలో... రకరకాల వ్యాధుల్ని నయం చేసే లక్షణాలు ఉన్నాయనే బూటకపు ప్రచారం చేస్తూ వేటగాళ్లు ఈ జంతువుల్ని పట్టుకెళ్లి అమ్ముకుంటున్నారు. ఎంతో సిగ్గు, మొహమాటం, భయం కలిగివుండే పాంగోలిన్స్... తమ దగ్గరకు మనుషులు వస్తే... వేగంగా పారిపోలేక... బంతిలా గుండ్రంగా చుట్టుకుంటాయి. అంతే... అలా చుట్టుకోగానే... సంచిలో వేసి పట్టుకుపోతున్నారు వేటగాళ్లు. ఫలితంగా ఈ చిత్రమైన ఆకారం గల జంతువుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇప్పుడు చూద్దామన్నా జూకి వెళ్లినా కనిపించనంత తక్కువ సంఖ్యలో ఉంటున్నాయి ఇవి.


వరల్డ్ పాంగోలిన్స్ డే సందర్భంగా... ఈ జంతువుల్ని కాపాడాలని మనలాంటి వాళ్లం ప్రతిజ్ఞలు చేస్తుంటాం. కానీ ప్రపంచవ్యాప్తంగా వేటగాళ్లు వీటిని చంపుతూనే ఉన్నారు. తాజాగా వీటిని చంపేందుకు వేటగాళ్లు మరో ఎత్తుగడ వేశారు. అదే కరోనా వైరస్ (కొవిడ్ 19 - Covid 2019). ఈ వైరస్ సోకడానికి ఇవి కూడా కారణమే అనే ప్రచారం చేస్తూ... వీటిని ప్రజలే చంపేయమని కోరుకునేలా చేయాలన్నది వేటగాళ్ల యత్నం. పాంగోలిన్స్ వల్ల కరోనా వైరస్ వస్తుందా అన్న అంశంపై పరిశోధకులు ఇప్పటివరకూ స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు. పరిశోధనలు కొనసాగుతున్నాయి.




ఆసియా, ఆఫ్రికాలో కనిపించే పాంగోలిన్స్‌ని ఎక్కువగా చంపేస్తున్నది చైనా లోనే. వీటి మాంసాన్ని మార్కెట్లలో అక్రమంగా అమ్మడమే కాదు... వీటి బాడీపై ఉండే అచ్చులను (పెంకులు) చైనా సంప్రదాయ ఔషధాల (మందులు) తయారీలో వాడుతున్నారు. పాంగోలిన్స్‌ని అమ్మడం, కొనడం ప్రపంచవ్యాప్తంగా నిషేధం. చైనాలో కరోనా వైరస్ వ్యాపించిన వుహాన్ సీ-ఫుడ్ మార్కెట్‌లో రకరకాల అరుదైన, అంతరించిపోయే జీవుల్ని అమ్ముతుంటారు. వాటిలో పాంగోలిన్స్ కూడా ఉన్నాయి.






నిజానికి ఇలాంటి జీవులు ఉండటం వల్లే మన పర్యావరణంలో మనం ప్రశాంతంగా బతకగలుగుతున్నాం. ఈ జీవరాసి, ప్రాణులు లేకపోతే... మానవుల మనుగడ కూడా ఉండదు. అందరం ఈ ప్రకృతిలో భాగమే కాబట్టి... ప్రకృతి ఎంత నాశనమైతే... అంతలా మనమూ దెబ్బతింటాం. ఇప్పటికే చాలా రకాల జీవులు, జంతువులు, పక్షులు, వృక్షాలు అంతరించిపోయాయి.

First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు