17 రోజులు కరోనా వచ్చిన తల్లితో చిన్నారి...అయినా సోకని వైరస్

కరోనా నుంచి కోలుకున్న తల్లితో చిన్నారి

కరోనా వచ్చిన మహిళ రెండేళ్ల బిడ్డను తీసుకోవడానికి బంధువులెవరూ ముందుకు రాలేదు. చిన్నారికి కరోనా లేదని నిర్ధారణ అయినా... బంధువులెవరూ ఆ పాపను చేరదీయలేదు.

 • Share this:
  కరోనా పేషెంట్ల ద్వారా వారి చుట్టుపక్కల ఉన్న వారికి వైరస్ ఎంత వేగంగా సోకుతోందో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులను బట్టి అర్థమవుతోంది. అయితే చిత్తూరు జిల్లా నగరికి చెందిన ఓ చిన్నారి విషయంలో జరిగిన సంఘటన అక్కడి వైద్యులకు కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. కొద్దిరోజుల క్రితం నగరిలో ఉన్న ఓ మహిళకు కరోనా సోకింది. దీంతో ఆమెను అధికారులు క్వారంటైన్‌కు తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే కరోనా వచ్చిన మహిళ రెండేళ్ల బిడ్డను తీసుకోవడానికి బంధువులెవరూ ముందుకు రాలేదు. చిన్నారికి కరోనా లేదని నిర్ధారణ అయినా... బంధువులెవరూ ఆ పాపను చేరదీయలేదు.

  దీంతో చేసేది లేక ఆ మహిళ తనతో పాటే బిడ్డకు క్వారంటైన్ సెంటర్‌కు తీసుకెళ్లింది. అయితే తల్లి ద్వారా బిడ్డకు కరోనా సోకితే పరిస్థితి ఎలా ఉంటుందో అని అధికారులు, వైద్యులు ఆందోళన చెందారు. క్వారంటైన్‌లో తల్లితో పాటు ఇతర రోగుల మధ్యే 17 రోజులు ఉన్న చిన్నారికి కూడా వైరస్ సోకే అవకాశం ఉందని భావించారు. అందుకే వైరస్ సోకిన తల్లితో పాటు పలుసార్లు చిన్నారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టారు.

  అయితే ఈ వైరస్ నుంచి మహిళ కోలుకోగా... ఆమెతో పాటు వచ్చిన చిన్నారికి కరోనా సోకలేదు. ఇందుకు ఆ చిన్నారి రోగ నిరోధక శక్తితో పాటు తల్లి తీసుకున్న జాగ్రత్తలే కారణమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కరోనా నుంచి మహిళ కోలుకోవడం, ఆ చిన్నారి కూడా క్వారంటైన్ నుంచి క్షేమంగా ఇంటికి చేరుకోవడంపై నగరి ఎమ్మెల్యే రోజా హర్షం వ్యక్తం చేశారు. ఇదంతా దేవుడి దయ అని ఆమె అన్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published: