Covid vaccine: కోవిడ్ టీకా రెండో డోస్ ఆలస్యమైతే ఏమవుతుంది? అన్ని ప్రశ్నలకూ ఇక్కడ సమాధానం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ఇప్పటికీ ఎన్నో అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. మొదటి డోసు తీసుకున్న తరువాత కోవిడ్ సోకితే పరిస్థితి ఏంటి..? రెండో డోసు ఎన్ని వారాల తరువాత తీసుకోవాలి? వంటి ఎన్నో ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు ఇక్కడ చూడండి.

  • Share this:
భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి సైతం వ్యాక్సిన్ ఇస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ టీకాల కొరత కారణంగా వ్యాక్సినేషన్ నెమ్మదిస్తోంది. చాలా ప్రాంతాల్లో స్లాట్ బుకింగ్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో అన్ని వయసుల వారు టీకాలు తీసుకునేందుకు మరికొంత సమయం పట్టవచ్చు. ఈ నేపథ్యంలో మొదటి డోసు తీసుకున్న తరువాత కోవిడ్ సోకితే పరిస్థితి ఏంటి, రెండో డోసు ఎన్ని వారాల తరువాత తీసుకోవాలి.. తదితర ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.

భారత్‌లో ఎలాంటి వ్యాక్సినేషన్ పాలసీ అమల్లో ఉంది?
ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను మన దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసింది. కోవాగ్జిన్ టీకాను భారత్ బయోటెక్ లిమిటెడ్ తయారు చేసింది. ప్రస్తుతం ఈ రెండు వ్యాక్సిన్లను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో 17.7 కోట్లకు పైగా టీకాలు వేశారు. ఇందులో రెండవ డోసు తీసుకున్నవారు 3.9 కోట్లకు పైగా ఉన్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభమైన కొత్తలో కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గడువు నాలుగు నుంచి ఆరు వారాలు ఉండాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపింది. తరువాతి పరిశోధనల ఆధారంగా ఈ గడువును ఆరు నుంచి ఎనిమిది వారాలకు పెంచింది. కోవాగ్జిన్ రెండు డోసుల మధ్య గడువు 28 రోజులుగా నిర్దేశించగా, తరువాత దీన్ని నాలుగు నుంచి ఆరు వారాలకు పొడిగించారు.

టీకా తీసుకోవడానికి ముందు కరోనా సోకితే.. ఆ తరువాత ఎన్ని రోజులకు వ్యాక్సిన్ తీసుకోవచ్చు?
ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోని వారు కరోనా బారిన పడితే.. పాజిటివ్ నిర్ధారణ అయిన రోజు నుంచి కనీసం 90 రోజుల తరువాతే కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకోవాలని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) సూచిస్తుంది. ఒక్కసారి కోవిడ్ సోకి, కోలుకున్న వారి శరీరంలో సహజంగానే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. ఇవి కనీసం ఆరు నెలల వరకు యాక్టివ్‌గా ఉంటాయి. అందువల్ల వీరు వ్యాక్సిన్ కోసం ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు వేచి ఉండటం మంచిదని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఇఆర్)కు చెందిన ఇమ్యునాలజిస్ట్ డాక్టర్ వినీతా బాల్ తెలిపారు. SARS-CoV-2 వైరస్‌ సోకి, పూర్తిగా కోరుకున్న వారిలో వృద్ధి చెందే యాంటీబాడీలు, వైరస్‌ నుంచి 80 శాతం రక్షణను ఇస్తాయని ప్రముఖ వ్యాక్సిన్ శాస్త్రవేత్త డాక్టర్ గగన్‌దీప్ కాంగ్ చెప్పారు. వీరు వ్యాక్సిన్ కోసం ఆరు నెలల వరకు వేచి ఉండటం మంచిదని ఆమె సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇదే చెబుతోంది.

మొదటి డోసు తీసుకున్న తరువాత కరోనా సోకితే?
మొదటి డోసు తరువాత వైరస్ సోకిన వారు, పూర్తిగా కోలుకున్న తరువాతే రెండో డోసు తీసుకోవాలి. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినప్పటి నుంచి ఎనిమిది వారాల తర్వాత వీరు రెండవ డోసు తీసుకోవచ్చు. అప్పటికే వారిలో కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. అందువల్ల రెండో డోసు ఆలస్యమైనా పెద్దగా ప్రమాదం ఉండదు. ఇలా ఇన్‌ఫెక్షన్ సోకిన వారిలో వ్యాధి తేలికపాటి, మధ్యస్థ లక్షణాలతో బయటపడవచ్చు.

ఫస్ట్ డోస్ అనంతరం మూడు వారాల లోపు వైరస్ సోకితే, టీకా ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. కానీ మూడు వారాల తరువాత మాత్రం టీకా ద్వారా యాంటీబాడీలు గణనీయంగా పెరుగుతాయి. ఫలితంగా వైరస్ ప్రమాదకరంగా మారే అవకాశం తక్కువ. వ్యాక్సిన్ తీసుకున్న రెండు వారాల తరువాత వీటి వృద్ధి మొదలవుతుందని సీడీసీ చెబుతోంది. అందువల్ల ఆలోపు వైరస్ సోకే అవకాశాలను కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు.

* టీకాల కొరత కారణంగా రెండో డోసు ఆలస్యమైతే ఎలాంటి ప్రభావం ఉంటుంది?
రెండవ డోసు ఆలస్యమైనా భయపడాల్సిన అవసరం లేదు. అలాగని దాన్ని నిరవధికంగా వాయిదా వేయవద్దు. కోవాగ్జిన్ మొదటి డోస్ తీసుకున్నవారు 45 రోజుల లోపు రెండో డోసు తీసుకోవాలి. కోవిషీల్డ్ విషయంలో ఈ గడువు మూడు నెలల వరకు ఉన్నా సమస్య ఉండదు. ఈ అంశంపై శాస్త్రవేత్తల ప్రయోగాలు కొనసాగుతున్నాయి. కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య 12 వారాల గడువు ఉంటే, వ్యాక్సిన్ సామర్థ్యం 81.3 శాతం వరకు ఉంటుందని లాన్సెట్ జర్నల్ ప్రకటించింది. ఇది ఆరు వారాల కన్నా తక్కువగా ఉంటే మాత్రం, వ్యాక్సిన్ సమర్థత 55.1 శాతానికి మాత్రమే పరిమితం కావడం విశేషం. కోవాగ్జిన్ వంటి ఇన్ యాక్టివేటెడ్ వ్యాక్సిన్లు ఒక డోసుతో కొద్దిపాటి రక్షణ మాత్రమే ఇస్తాయి. ఎక్కువ రక్షణ కోసం రెండు డోసులను సరైన సమయంలో తీసుకోవాలి.

* మొదటి డోసు కోవాగ్జిన్‌ టీకా తీసుకున్నవారు, వ్యాక్సిన్ల కొరత కారణంగా రెండు డోసుగా కోవిషీల్డ్ తీసుకోవచ్చా?
కోవిడ్ వ్యాక్సిన్లను ప్రత్యేకమైన పద్ధతుల్లో అభివృద్ధి చేశారు. కోవాగ్జిన్‌ను ఇన్‌యాక్టివేటెడ్ వైరస్ సాయంతో, కోవిషీల్డ్‌ను వైరల్ వెక్టార్ ప్లాట్‌ఫాం ఆధారంగా అభివృద్ధి చేశారు. అందువల్ల మొదటి డోసుగా తీసుకున్న టీకాలనే రెండో డోసులో కూడా తీసుకోవాలి. టీకాలు అందుబాటులో లేనప్పుడు కొన్ని రోజులు వేచి చూడటం మంచింది. అంతేకానీ వేరే వ్యాక్సిన్‌ను రెండో డోసుగా తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: