దేశమంతా లాక్డౌన్.. ఇంట్లోంచి కాలు తీసి బయట పెట్టాలంటే భయం.. ఎవరి నుంచి కరోనా సోకుతుందోనన్న అనుమానం.. నిత్యావసరాల వస్తువుల కొనుక్కుందామనుకున్నా పరిస్థితి బాగోలేదు. మార్కెట్కు వెళితే అక్కడ కుప్పలు తెప్పలుగా జనం.. అందుకే విజయవాడ మునిసిపల్ కమిషనర్ ప్రసన్న వేంకటేశ్ వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. లాక్డౌన్ సమయంలో కూరగాయల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు, వీలైనంత ఎక్కువ మందికి కూరగాయలను అందించే ఉద్దేశంతో సిటీ బస్సులను సంచార రైతు బజార్లుగా మార్చే దిశగా చర్యలు చేపట్టారు. దీని కోసం ఆర్టీసీ బస్సులను అద్దె తీసుకొని, నిన్న ప్రయోగాత్మకంగా సంచార రైతు బజార్లను నిర్వహించారు. దీనికి విశేష స్పందన లభించడంతో మరిన్ని సిటీ బస్సులను సంచార రైతు బజార్లుగా మార్చాలని చూస్తున్నారు.
దీనిపై, ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సుల ద్వారా నగరంలోని 53 డివిజన్ల పరిధిలో కూరగాయలు విక్రయించాలని యోచిస్తున్నామని చెప్పారు. బస్సుల ద్వారా ప్రజల వద్దకే కూరగాయలను తీసుకెళ్లడం ద్వారా గుమికూడకుండా చేయవచ్చని ఆయన అన్నారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, తొలి రోజు 8 క్వింటాళ్ల కూరగాయలు విక్రయించామని వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, Corona, Corona virus, Coronavirus, Covid-19, Vijayawada, Vijayawada S01p12