స్కూళ్లో కూరగాయల సాగు.. పేదలకు ఉచితంగా పంపిణీ.. కరోనా వేళ నిజమైన హీరోలు

ప్రతీకాత్మక చిత్రం

కరోనా విజృంభణ వేళ కొంత మంది మానవత్వంతో తమకు తోచిన సహాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. కేరళలోని ఎడమురి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది కూడా ఇలాంటి పనే చేసి తమ సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు.

  • Share this:
కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను అస్తవ్యస్థం చేస్తోంది. కరోనాతో ఉపాధి కోల్పోయి అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కరోనా చావుల కంటే ఆకలి చావులు ఎక్కువయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో కొంత మంది మానవత్వంతో తమకు తోచిన సహాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. కేరళలోని ఎడమురి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది కూడా ఇలాంటి పనే చేసి తమ సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. పేద కుటుంబాలకు ఉచితంగా కూరగాయలు అందించడానికి తమ పాఠశాలను వ్యవసాయ క్షేత్రంగా మార్చారు.

ఈ కొత్త ఒరవడిపై ఉపాధ్యాయుడు బినిష్ ఫిలిప్​ మాట్లాడుతూ.. ‘మా పాఠశాల సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ ఎకరానికి పైగా పొదలతో నిండిన పనికిరాని భూమి ఉంది. ఇంతకుముందు చాలా సార్లు ప్రభుత్వ నిధులతో భూమిని చదును చేయించాం. అయినప్పటికీ, ఆ భూమి నిరుపయోగంగా పడి ఉండటంతో మూడు నెలల్లోనే విపరీతంగా చెట్లు మొలిచేవి. దీంతో ఈ భూమిలో ఏదైనా సాగు చేయాలని మా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆలోచించారు. తన ఆలోచనను పాఠశాల నిర్వహణ కమిటీ స్వాగతించింది. అనుకున్నదే తడవుగా కృషి భవన్​, ఎంజిఎన్ఆర్ఈజిఎ కార్మికుల సహకారంతో పాఠశాల భూమిని చదును చేశాం. ఇప్పుడు ఇక్కడ కూరగాయలు పండిస్తున్నాం. నిరుపయోగంగా ఉన్న ఈ భూమిలో కూరగాయలు పండించడం ఎంతో సంతోషంగా ఉంది’ అని వివరించారు.

ఉపాధి కోల్పోయిన వారికి ఉచితంగా..
కోవిడ్ -19 లాక్డౌన్ సమయంలో పాఠశాలలు మూసివేయడంతో ఉపాధ్యాయులకు ఖాళీ సమయం దొరికింది. ఈ సమయంలో వివిధ రకాల కూరగాయలు, దుంపలు, అరటిపండ్లను సాగు చేశారు. సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, సాంకేతిక సహాయాన్ని స్థానిక కృషి భవన్ అధికారులు ఉచితంగా అందజేశారు. ఈ పంటల సాగుకు ఉపాధ్యాయులు బినీష్, లిన్సిమోల్ పిఆర్, బోధనేతర సిబ్బంది అరవింద్ మోహన్​, బాలన్ నాయకత్వం వహించారు.

పంటల సాగుపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సునీల్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ ఎకరం భూమిలో బచ్చలికూర, వంకాయ, బెండకాయ, మిరపకాయలు, కాలీఫ్లవర్, బఠానీలు సాగు చేస్తున్నాం. పసుపు, అరటి, టాపియోకా వంటి పంటలు కూడా వేశాం. మా పాఠశాల విద్యార్థుల్లో ఎక్కువ మంది గిరిజన కుటుంబాలకు చెందినవారు. ఈ పేద కుటుంబాలకు కూరగాయలను ఉచితంగా అందజేస్తున్నాం. కరోనా సమయంలో ఈ సాగు మాకు కొత్త పాఠాలు నేర్పుతోంది’ అని సునీల్ తెలిపారు.
Published by:Shiva Kumar Addula
First published: