కరోనా పేషెంట్‌తో మాజీ సీఎం, బీజేపీ ఎంపీల డిన్నర్.. పార్లమెంట్‌లో కలకలం

డిన్నర్ పార్టీలో కనికా కపూర్, వసుంధరా రాజే, దుశ్యంత్

దేశప్రజలందరూ ఇళ్లల్లో ఉండాలంటున్న ప్రధాని.. పార్లమెంట్ సమావేశాలను మాత్రం ఎందుకు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తాను కూడా బీజేపీ ఎంపీ దుశ్యంత్ పక్క సీట్లో సుమారు 3 గంటల పాటు కూర్చున్నానని ఆందోళన వ్యక్తం చేశారు.

 • Share this:
  ఇప్పుడు దేశవ్యాప్తంగా బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ పేరు మార్మోగుతోంది. లండన్ పర్యటన అనంతరం ఇండియాకు వచ్చిన ఆమెకు కరోనా వైరస్ సోకింది. ఫ్లూ లక్షణాలతో టెస్ట్‌లు చేయించుకోవడంతో కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. ఐతే ఇటీవలే లక్నోలో కనికా కపూర్ ఓ డిన్నర్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ పార్టీకి రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే, ఆమె కుమారుడు, ఎంపీ దుశ్యంత్‌తో పాటు బంధువులు హాజరయ్యారు. కనికాతో భోజనం చేయడంతో పాటు ఆమెతో కలిసి ఫొటోలు దిగారు. పార్టీలో ఆమెకు దగ్గరగా మెలిగారు. ఐతే అంతలోనే కనికాకు కరోనా సోకిందన్న విషయం తెలియడం ఇప్పడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఎంపీగా ఉన్న దుశ్యంత్.. కనికాను కలిసిన అనంతరం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. అంతేకాదు ఈ నెల 18న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కూడా కలిశారు. దాంతో పార్లమెంట్‌లోనూ కరోనా కలకలం రేగింది.
  డిన్నర్ పార్టీలో కనికా కపూర్, వసుంధరా రాజే, ఎంపీ దుశ్యంత్

  కనికాకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వసుంధరా రాజే ఫ్యామిలీ అప్రమత్తమైంది.  లక్నోలో తాము హాజరైన ఓ డిన్నర్ పార్టీకి కనికా కూడా వచ్చిందని.. దురదృష్టవశాత్తు ఆమెకు కరోనావైరస్ సోకిందని వసుంధరా రాజే తెలిపారు. అందుకే ముందుజాగ్రత్తగా  తాను, దుశ్యంత్ స్వీయ నిర్బంధంలో ఉన్నామని ట్వీట్ చేశారు రాజే. ఈ వ్యవహారంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ తీవ్రంగా స్పందించారు. మోదీ ప్రభుత్వం అందరినీ రిస్క్‌లో పెట్టిందని విమర్శలు గుప్పించారు. దేశప్రజలందరూ ఇళ్లల్లో ఉండాలంటున్న ప్రధాని.. పార్లమెంట్ సమావేశాలను మాత్రం ఎందుకు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తాను కూడా బీజేపీ ఎంపీ దుశ్యంత్ పక్క సీట్లో సుమారు 3 గంటల పాటు కూర్చున్నానని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొందరు ఎంపీలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారని చెప్పారు ఒబ్రెయిన్. అందుకే పార్లమెంట్ సమావేశాలను వెంటనే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.


  కనికా కపూర్ 10 రోజుల క్రితమే ఇండియాకు వెళ్లొచ్చారు. కరోనా వైరస్‌పై ప్రభుత్వాలు ఇంత అవగాహన కల్పిస్తున్నా.. తాను లండన్‌ వెళ్లిన విషయాన్ని మాత్రం దాచిపెట్టారు. డిన్నర్ పార్టీకి వెళ్లి అందరినీ కలిశారు. ఆ తర్వాత మూడు రోజులకు ఆమెకు జలుబు, దగ్గు, జ్వరం రావడంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో ఆమెకు కరోనా వైరస్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో కనికాను వసుంధరా రాజే, ఎంపీ దుశ్యంత్ కలవడం.. అదే దుశ్యంత్ పార్లమెంట్ సమావేశాలకు వెళ్లడంతో తీవ్ర కలకలం రేగుతోంది. కనికా, దుశ్యంత్ కలిసిన వారందరికీ పరీక్షలు చేసి, క్వారంటైన్ చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: