VACCINES REDUCED 3RD WAVE IMPACT INDIA COVID CASES TO DIP BY FEB 15 SAYS GOVT SOURCES MKS
Covid: ఫిబ్రవరి 15 నాటికి కొవిడ్ కేసులు తగ్గుముఖం.. మూడో వేవ్ ఉదృతిని తగ్గించిన వ్యాక్సిన్లు: కేంద్రం
ప్రతీకాత్మక చిత్రం
రాబోయే రెండు వారాల్లో కేసుల ఉధృతి తగ్గుతుందని, ఫిబ్రవరి 15 నాటికి చాలా వరకు అదుపులోకి వస్తాయని, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పకడ్బందీగా సాగుతున్నందువల్లే మూడో వేవ్ ప్రభావం తగ్గిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
దేశంలో కరోనా విలయానికి సంబంధించి భారీ ఉపశమనం కలిగించే వార్త కేంద్ర వర్గాల నుంచి వెల్లడైంది. దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ మూడో వేవ్ కొనసాగుతున్న క్రమంలో కొత్త కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. యాక్టివ్ కేసులు అసాధారణంగా 22లక్షల పైచిలుకుగా ఉన్నాయి. కాగా, రాబోయే రెండు వారాల్లో కేసుల ఉధృతి తగ్గుతుందని, ఫిబ్రవరి 15 నాటికి చాలా వరకు అదుపులోకి వస్తాయని, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పకడ్బందీగా సాగుతున్నందువల్లే మూడో వేవ్ ప్రభావం తగ్గిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
భారత్‌లో ప్రస్తుతం కరోనా మూడోవేవ్ నడుస్తోంది. కొద్దిరోజులుగా కొత్త కేసులు 3 లక్షలపైనే నమోదవుతున్నా.. మూడురోజులుగా వాటిలో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ వర్గాలు ఊరటనిచ్చే మాట చెప్పాయి. ఫిబ్రవరి 15 నాటికి కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వెల్లడించాయి. అలాగే టీకా కార్యక్రమం మూడోవేవ్ ప్రభావాన్ని తగ్గించిందని పేర్కొన్నాయి.
'ఫిబ్రవరి 15 నాటికి కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాలు, మెట్రో నగరాల్లో కేసులు తగ్గడం, స్థిరంగా ఉండటం ప్రారంభమైంది' అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం తెలిపిన గణాంకాల ప్రకారం.. ఈ రోజు(జనవరి 24) 3,06,064 కరోనా కేసులు వెలుగుచూశాయి. జనవరి 23న 3.33 లక్షలు, జనవరి 22న 3.37 లక్షలు, జనవరి 21న 3.47 లక్షల కేసులు నమోదయ్యాయి. మూడు రోజులుగా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది.
మరోపక్క ప్రస్తుతం దేశంలో 74 శాతం మంది అర్హులైన వయోజనులు రెండు డోసుల టీకా తీసుకున్నారు. 15 నుంచి 18 మధ్య వయస్సులో ఉన్న టీనేజర్లకు తొలి డోసు ఇస్తున్నారు. 60 ఏళ్లు దాటి ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నవారు, ఫ్రంట్‌లైన్ సిబ్బంది, వైద్య సిబ్బందికి ప్రికాషనరీ డోసు ఇవ్వడం వంటి చర్యలు థర్డ్ వేవ్ తీవ్రతను తగ్గించిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఇదిలా ఉండగా.. జనవరి ప్రారంభంలో కొత్త కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తాజాగా వేవ్‌కు ప్రధాన కారణం. దేశంలో ఈ వేరియంట్ సమూహ వ్యాప్తి స్థాయికి చేరిందని, రానున్న వారాల్లో కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. అలాగే ప్రధాన నగరాల్లో కేసులు తగ్గుతున్నప్పటికీ.. ఆసుపత్రుల్లో చేరికలు పెరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం కొత్త కేసుల్లో ఆకస్మిక పెరుగుదల కనిపించనప్పటికీ.. ఏ మాత్రం అజాగ్రత్తవద్దని చెబుతున్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.