భారత్‌లో మరో కరోనా వ్యాక్సిన్ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. అమెరికా సంస్థ ఫైజర్ తయారు చేసిన వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వం త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని సమాచారం. భారత్‌లోని వైరస్ వేరియంట్లపై ఫైజర్ సమర్థవంతంగా పని చేస్తుందని వైద్య నిపుణులు అంచనా వేశారు. దీంతో పాటు ఆ సంస్థ కూడా ఫాస్ట్‌ట్రాక్ అనుమతి కోరిన నేపథ్యంలో ఈ దిశగా కేంద్రం ఆలోచిస్తోంది. అలాగే తమ టీకా 12 ఏళ్లు పైబడిన అందరికీ ఎంతో సురక్షితమని ఫైజర్ సంస్థ.. భారత ప్రభుత్వానికి చెప్పినట్టు సమాచారం. థర్డ్ వేవ్‌లో పిల్లలపై కూడా వైరస్ ప్రభావం చూపుతుందనే అంచనాలు వెలువడుతుండడంతో అన్ని కంపెనీలు పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు సిద్ధమయ్యాయి. దీంతో ఫైజర్ సంస్థతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతోంది. అలాగే 2 నుంచి 8 డిగ్రీల సెల్సియల్లో తమ వ్యాక్సిన్ నిల్వ చేయవచ్చంటూ టీకా వివరాలను ఫైజర్ అందజేసిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
భారత్‌కు వ్యాక్సిన్‌ను తీసుకొచ్చేందుకు ముందే కొన్ని నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఫైజర్ అడిగిందని సమాచారం. మరోవైపు వ్యాక్సిన్ పనితీరు, వైరస్ నుంచి ఎంతకాలం రక్షణ కల్పిస్తుందనే విషయాల గురించి ప్రభుత్వం, ఫార్మా సంస్థ మధ్య చర్చలు జరిగాయి. ఈ ఏడాది ముసిగేలోగా భారత్‌కు 5కోట్ల వ్యాక్సిన్ డోసులను సరఫరా చేయాలని ఫైజర్ భావిస్తోంది. అమెరికాకే చెందిన మరో ప్రముఖ పార్మా సంస్థ మోడెర్నా కూడా భారత్‌లో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. భారత కంపెనీ సిప్లాతో పాటు మరిన్ని సంస్థలతో చేతులు కలపాలని మోడెర్నా ఆలోచిస్తోంది.
మరోవైపు తమ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేగవంతం చేసేందుకు కొన్ని రాష్ట్రాలు గ్లోబర్ టెండర్లను సైతం ఆహ్వానించాయి. విదేశాల్లోని టీకా సంస్థలు టెండర్లలో పాల్గొనాలని ప్రకటించాయి. అయితే ఫైజర్, మోడెర్నా మాత్రం నేరుగా రాష్ట్రాలకు టీకాలను సరఫరా చేసేందుకు విముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలు టీకాల కోసం సంప్రదించగా.. తాము నేరుగా కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే ఒప్పందాలు చేసుకుంటామని స్పష్టం చేశాయని చెప్పాయట.
భారత్‌లో ఇప్పటి వరకు దాదాపు 15.50 కోట్ల మందికి తొలి టీకా డోసు వేసుకోగా.. రెండు డోసులు తీసుకున్న వారు 4.2కోట్ల మందేనని గణాంకాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని కేంద్రం అనుకుంటున్నది. ఇప్పటి వరకు కొవిషీల్డ్, కోవాగ్జిన్, స్ఫుత్నిక్ వీ టీకాలకు అనుమతులు ఇచ్చిన భారత సర్కారు.. త్వరలోనే ఫైజర్‌కు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ఖాయంగా మారింది. వ్యాక్సినేషన్ పెంచితే మూడో వేవ్‌ను సమర్థంగా ఎదుర్కోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాక్సిన్ల కోసం వేచిచూస్తున్నాయి. వైరస్‌ను వీలైనంత త్వరగా కట్టడి చేస్తే లాక్డౌన్లను సడలించవచ్చని, అలాగైతే ఆర్థిక పరిస్థితులు మళ్లీ గాడిన పడతాయని భావిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid vaccine, Pfizer Vaccine