news18-telugu
Updated: March 25, 2020, 3:28 PM IST
(ఫైల్ ఫోటో)
US Coronavirus : కరోనా దెబ్బకు ప్రపంచం అల్లకల్లోలం అవుతోంది. ఆ వైరస్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. చైనా, ఇటలీ, స్పెయిన్, అమెరికా.. తదితర దేశాల్లో ప్రజలు కుప్పలు తెప్పలుగా శవాలుగా మారుతున్నారు. కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ప్రాణ నష్టంతో పాటు భారీ ఆస్తి నష్టం కూడా చోటుచేసుకుంటోంది. ఎన్నో వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. కార్మికులు, కూలీలు ఉపాధి కోల్పోతున్నారు. ఉద్యోగులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాజా లెక్కల ప్రకారం.. కరోనా దెబ్బకు దాదాపు 2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతారట. కాగా, తన దేశ ప్రజల్ని ఆదుకొనేందుకు అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ప్రజలకు ట్రంప్ సర్కారు ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చేందుకు ముందుకొచ్చింది.
సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల(రూ.కోటి 52 లక్షల కోట్లు) ప్యాకేజీ ఇవ్వడానికి యూఎస్ సెనేట్, వైట్‌హౌజ్ బృందం అంగీకరించింది. దీంతో.. వ్యాపారవేత్తలు, కార్మికులు, వైద్య సిబ్బంది ఈ ప్యాకేజీ కింద భారీ మొత్తంలో డబ్బు అందుకోనున్నారు. ప్రతీ ఒక్కరికి ఉద్దీపన ప్యాకేజీ నుంచి నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులు బదిలీ కానున్నాయి. అయితే, ఆధునిక అమెరికా చరిత్రలోనే ఇది అతి పెద్ద ఉద్దీపన ప్యాకేజీ అని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోని ప్రతి ఒక్క వ్యక్తికి ప్యాకేజీలో భాగంగా రూ.91వేలు(1200 డాలర్లు) అందుకోనున్నారు. అంతేకాదు.. అక్కడి పిల్లలకు 500 డాలర్లు ఇవ్వనున్నారు.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
March 25, 2020, 1:50 PM IST