అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తాము హోం క్వారంటైన్‌లో ఉన్నామని ట్రంప్ ట్వీట్ చేశారు. ట్రంప్ సలహాదారు హోప్ హిక్స్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన కొన్ని గంటల్లోనే.. అధ్యక్ష దంపతులకు కూడా కరోనా నిర్ధారణ అయింది. హోప్ హిప్స్‌తో కలిసి ఇటీవలే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ట్రంప్. ఆమె నుంచే ట్రంప్‌కు వైరస్ సంక్రమించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అమెరికా ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్న సమయంలోనే ట్రంప్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Tonight, @FLOTUS and I tested positive for COVID-19. We will begin our quarantine and recovery process immediately. We will get through this TOGETHER!
— Donald J. Trump (@realDonaldTrump) October 2, 2020
మొదట డొనాల్ట్ ట్రంప్ సలహాదారు హోప్ హిక్స్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అప్రమత్తమైన వైట్ హౌస్ సిబ్బంది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు. అనంతరం వచ్చిన ఫలితాల్లో వీరిద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అధ్యక్షుడు ట్రంప్ ఎక్కడికి వెళ్లినా ఆయన వెంటే ఉంటారు హోప్ హిక్స్. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్‌తో పాటు తరచుగా ప్రయాణాలు చేస్తుంటారు. అంతేకాదు ఇటీవల ఓహియోలో జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్ కార్యక్రామానికి కూడా ట్రంప్‌తో కలిసి వెళ్లారు హోప్ హిక్స్. మిన్నెసోటలో జరిగిన ర్యాలీ అనంతరం మెరైన్ వన్ హెలికాప్టర్‌లో ట్రంప్‌తో పాటే ఆమె ప్రయాణించారు.
రెండు రోజుల క్రితం ఒహాయోలోని క్లీవ్‌లాండ్‌లో జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో ట్రంప్ పాల్గొన్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌తో ఈ చర్చ వాడీవేడీగా జరిగింది. ఆరోగ్యం, న్యాయం, జాతి వివక్ష, ఆర్థిక వ్యవస్థ లాంటి రకరకాల అంశాలపై ఇరువురి మధ్య పలు అంశాలపై చర్చించారు. డిబేట్‌కు అమెరికా న్యూస్ చానల్ ఫాక్స్ న్యూస్ యాంకర్ 72 ఏళ్ల క్రిస్ వాలెస్ హోస్ట్‌గా వ్యవహరించారు. కరోనా వేళ సామాజిక దూరం నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రజలను అనుమతించారు. ఇక కరోనా విజృంభణ కారణంగా ఇద్దరు నేతలు కరచాలనం చేయలేదు.
కాగా, అమెరికాలో ఇప్పటి వరకు 74,94,671 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 47,36,621 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. అమెరికాలో కరోనా బారినపడి 2,12,660 మంది మరణించారు. ప్రస్తుతం అమెరికాలో 25,45,390 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. వీరిలో 14,190 మంది పరిస్థితి విషమంగా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Coronavirus, Covid-19, Donald trump, Melania Trump