మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్‌ను మించిపోయిన యువకుడు... పెళ్లికోసం...

భార్యతో ప్రజాపతి

వెళ్లేటప్పుడు 100 కిలోమీటర్లు. మళ్లీ వచ్చేటప్పుడు భార్యను వెనుక కూర్చోబెట్టుకుని సైకిల్ తొక్కాడు.

 • Share this:
  కరోనా వైరస్ లాక్ డౌన్ కాలంలో అప్పుడప్పుడు కొన్ని చిత్ర విచిత్రమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న ఓ యువకుడు కూరగాయలు తీసుకుని వస్తానని ఇంట్లో తల్లికి చెప్పి వెళ్లి వచ్చేటప్పుడు భార్యను తీసుకుని వచ్చాడు. ఆ తల్లి చూసి షాక్‌కి గురైంది. కొడుకు, కోడలు ఇద్దరినీ ఇంట్లో అడుగు పెడితే కాలు విరగ్గొడతానని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. తాజాగా, అలాంటి విచిత్రమైన ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు వంద కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి పెళ్లి చేసుకున్నాడు. వచ్చేటప్పుడు మళ్లీ 100 కిలోమీటర్ల తన భార్యను ఎక్కించుకుని తొక్కుతూ అత్తవారింటికి తీసుకొచ్చాడు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. యూపీలోని హమీర్‌పూర్ జిల్లాలోని పౌతియా గ్రామానికి చెందిన కల్కు ప్రజాపతి అనే యువకుడికి ఏప్రిల్ 25న పెళ్లి చేయాలని ఎప్పుడు నాలుగైదు నెలల క్రితం ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. అయితే, కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల ప్రజలు బయటకు రాలేని పరిస్థితి.పెళ్లి జరగడానికి ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించారు. అయితే, అధికారుల నుంచి అనుమతి రాలేదు. దీంతో ఎలాగైనా పెళ్లి ఆగకూడదని నిర్ణయించిన ప్రజాపతి తన గ్రామం నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహోబా జిల్లాలోని పునియా గ్రామానికి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు.

  ప్రజాపతి వద్ద మోటర్ సైకిల్ కూడా ఉంది. అయితే, అతడి వల్ల డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఇప్పుడు దాన్ని బయటకు తీస్తే అనవసరంగా పోలీసులు దాని మీద కేసు బుక్ చేస్తారన్న భయంతో వంద కిలోమీటర్లు సైకిల్ తొక్కడానికి రెడీ అయ్యాడు. ముఖానికి ఓ కర్చీఫ్ కట్టుకుని సైకిల్ తొక్కుకుంటూ అత్తవారింటికి చేరాడు. అక్కడ అప్పటికే సమాచారం ఉండడంతో అబ్బాయి రాగానే వెంటనే గుడిలో ఇద్దరికీ తూతూమంత్రంగా పెళ్లి జరిపించి మమ అనిపించారు. ఆ సమయంలో కూడా ఇద్దరూ ముఖాలకు కర్చీఫ్‌లు కట్టుకునే ఉన్నారు.

  పెళ్లి అయిపోగానే అయిపోలేదు. ఇప్పుడు పెళ్లికూతుర్ని తీసుకుని మళ్లీ సొంతూరుకు బయలుదేరాడు. మెడలో పూలదండలు, వెనుక కొత్త పెళ్లికూతుర్ని కూర్చోబెట్టుకుని, మళ్లీ ముఖాలకు కర్చీఫ్‌లు కట్టుకుని 100 కిలోమీటర్లు తొక్కుకుంటూ చివరకు ఇంటికి చేరాడు. ఆ తర్వాత ‘నా జీవితంలో కాళ్లు ఇంత నొప్పి పుడతాయని అనుకోలేదు. కాళ్ల నొప్పులు తగ్గడానికి మందులు వేసుకోవాల్సి వచ్చింది.’ అని ప్రజాపతి తెలిపాడు. పెళ్లి మమ అనిపించినా, లాక్ డౌన్ ముగిసిన తర్వాత బంధువులు అందరికీ ఫుల్ పార్టీ ఉంటుందని చెప్పాడు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: