Covid-19 Vaccine: కరోనా వ్యాక్సిన్లపై భారత్ వాదనకు అమెరికా సపోర్ట్..

ప్రతీకాత్మక చిత్రం

కరోనా‌‌ మహమ్మారి వంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు అసాధారణ నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారాలకు మేథోపరమైన హక్కుల రక్షణ అత్యంత కీలకం. అయితే కరోనా‌‌ టీకాకు సంబంధించి ఇలాంటి రక్షణ తొలగించాలనే వాదనకు అమెరికా మద్దతిస్తోందని కేథరిన్ చెప్పారు

  • Share this:
కరోనా‌‌ వ్యాక్సిన్లపై పేటెంట్ల మినహాయింపు కోసం భారతదేశం చేస్తున్న పోరాటానికి అమెరికా మద్దతు తెలిపింది. కొవిడ్‌ టీకాకు పేటెంట్ల నుంచి మినహాయింపు ఇవ్వాలనే భారత్‌ వాదన సరైనదే అని అగ్రరాజ్యం అభిప్రాయం వ్యక్తం చేసింది. వ్యాక్సిన్‌ తయారీని వేగవంతం చేయడానికి ఈ చర్య ఉపయోగపడుతుందని భారత్‌, దక్షిణాఫ్రికా గతంలో ప్రస్తావించాయి. కానీ తయారీ సంస్థలు దీన్ని వ్యతిరేకించాయి. అయితే తాజాగా అమెరికా ట్రేడ్‌ ర్రిప్రజెంటేటివ్‌ కేథరిన్‌ టై మాత్రం, ప్రస్తుత పరిస్థితుల్లో పేటెంట్‌ గురించి చర్చ అనవసరం అన్నారు. కరోనా‌‌ మహమ్మారి వంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు అసాధారణ నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారాలకు మేథోపరమైన హక్కుల రక్షణ అత్యంత కీలకం. అయితే కరోనా‌‌ టీకాకు సంబంధించి ఇలాంటి రక్షణ తొలగించాలనే వాదనకు అమెరికా మద్దతిస్తోందని కేథరిన్ చెప్పారు.

వంద మంది సభ్యులున్న వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌‌ (డబ్ల్యూటీవో) వచ్చే నెలలో సమావేశం కానుంది. అందులో ఈ అంశంపై చర్చించనున్నారు. కాపీరైట్స్‌, ట్రేడ్‌మార్క్‌లు, పేటెంట్ల ద్వారా రక్షించే ఉత్పత్తులు, ఇన్నోవేషన్లను ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ అంటారు. ఇలాంటి ఉత్పత్తులు రూపొందించినందుకు వారికి డబ్బులు రివార్డు రూపంలో ఇస్తారు. అయితే కరోనా సమయంలో పేటెంట్ల విధానానికి స్వస్తి పలకాలని భారత్‌, దక్షిణాఫ్రికా సహా 60 దేశాలు గత కొద్ది రోజులుగా గళమెత్తుతున్నాయి. దీన్ని బ్రిటన్‌, యురోపియన్‌ యూనియన్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోని యూఎస్‌ ప్రభుత్వం వ్యతిరేకించాయి. కానీ ఇప్పుడు బైడెన్‌ ప్రభుత్వం ఓకే చెప్పింది.

బైడెన్‌ నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్‌వో) డీజీ ట్రెడ్రోస్‌ అథనోమ్‌ స్వాగతించారు. కరోనాపై పోరులో ఇదొక మైలురాయిగా డబ్ల్యూహెచ్‌వో అభివర్ణించింది. కరోనా టీకాపై పేటెంట్ల మినహాయింపు వల్ల ఉత్పత్తి విషయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మినహాయింపు డబ్ల్యూటీవో అంగీకరిస్తే టీకా ఉత్పత్తి, లభ్యత విషయంలో చాలా ఉపయోగం ఉంటుంది. దాంతోపాటు పేద దేశాలకు టీకా అందుబాటులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. పేటెంట్ల వల్ల టీకా ఉత్పత్తి, లభ్యత విషయంలో ఇబ్బందులు వస్తున్నాయని అభివృద్ధి చెందిన దేశాలు కొన్ని చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనాను ఎదుర్కోవడానికి పేటెంట్‌ మినహాయింపు చాలా అవసరం. మరోవైపు అమెరికా నిర్ణయం నిరాశకు గురిచేసిందని ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ మ్యానిఫ్యాక్చెరర్స్‌ అసోసియేషన్‌ లాబీ స్పందించింది. పేటెంట్‌ విషయంలో మినహాయింపులు ఇవ్వడం తేలికే అయితే క్లిష్టమైన సమస్యకు ఇదొక తప్పుడు పరిష్కారం’ అని ఘాటుగా విమర్శించింది.
First published: