కరోనా వ్యాక్సిన్ డేటా కోసం సైబర్ దాడులు..రష్యాపై బ్రిటన్ సంచలన ఆరోపణలు

కరోనా వ్యాక్సిన్ డేటా కోసం సైబర్ దాడులు..రష్యాపై బ్రిటన్ సంచలన ఆరోపణలు

ప్రతీకాత్మక చిత్రం

రష్యాకు చెందిన హ్యాకర్లు యునైటెడ్ కింగ్ డమ్, అమెరికా, కెనడాల్లోని కరోనా వ్యాక్సిన్ రిసెర్చ్ సెంటర్ల మీద సైబర్ ఎటాక్‌కు పాల్పడినట్టు యూకే ఆరోపించింది.

 • Share this:
  రష్యాకు చెందిన హ్యాకర్లు యునైటెడ్ కింగ్ డమ్, అమెరికా, కెనడాల్లోని కరోనా వ్యాక్సిన్ రిసెర్చ్ సెంటర్ల మీద సైబర్ ఎటాక్‌కు పాల్పడినట్టు యూకే ఆరోపించింది. రష్యాకు చెందిన ఏపీటీ29 అనే గ్రూప్ ఈ సైబర్ ఎటాక్ చేసినట్టు ఆయా దేశాల సైబర్ సెక్యూరిటీ విభాగాలు గుర్తించాయి. రష్యాకు చెందిన ఈ హ్యాకర్స్‌ను ద డ్యూక్స్, కాజీ బేర్ అని కూడా పిలుస్తారు. యూకే జాతీయ సైబర్ భద్రతా విభాగం ఈ మేరకు హెచ్చరిక జారీ చేసింది. రష్యాకు చెందిన హ్యాకర్లు తమ ప్రభుత్వం, దౌత్య విభాగం, మేధావులు, హెల్త్ కేర్‌కు చెందిన విభాగాలపై సైబర్ ఎటాక్ చేసి మేథో పరమైన సమాచారం చోరీ చేయడానికి ప్రయత్నించారని ఆరోపించింది. కోజీ బేర్ అనేది రష్యా ఇంటెలిజెన్స్ విభాగానికి అనుబంధంగా పనిచేస్తుంటుంది. 2016 అమెరికా ఎన్నికల సమయంలో డెమొక్రటిక్ నేషనల్ కమిటీ అంతర్గత సిస్టమ్స్‌ను హ్యాక్ చేసినట్టు ప్రచారం ఉంది. కానీ, తొలిసారి కరోనా వైరస్ వ్యాక్సిన్ సమాచారం కోసం హ్యాకింగ్ చేయడానికి ప్రయత్నించినట్టు వెలుగులోకి వచ్చింది.  సైబర్ ఎటాక్స్ ఆరోపణలపై రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పందించారు. ఆ దాడులకు రష్యాకు సంబంధం లేదన్నారు. ‘యూకేలోని కోవిడ్ 19 రీసెర్చ్ సెంటర్లు, ఫార్మా కంపెనీల మీద ఎవరు సైబర్ ఎటాక్ చేశారో మాకు తెలీదు.’ అని ప్రకటించారు.

  కరోనా వాక్సీన్ కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. 20కి పైగా వాక్సీన్‌లు ప్రయోగ దశలో ఉన్నాయి. క్లినికల్ ట్రయల్స్‌‌ను విజయవంతంగా పూర్తిచేశామని ఇప్పటికే రష్యా ప్రకటించగా.. తాజాగా అమెరికా నుంచి మరో శుభవార్త వినిపించింది. తాము అభివృద్ధి చేసిన కరోనా వాక్సిన్‌తో.. ఊహించిన విధంగానే మంచి ఫలితాలు వస్తున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. తొలిదశ ప్రయోగాలు పూర్తై.. ఫైనల్ టెస్టింగ్ దశకు చేరుకుందని తెలిపారు. జులై 27 నుంచి ఫైనల్ టెస్టింగ్ ప్రక్రియ మొదలు పెడతామని పేర్కొన్నారు. ఈ దశంలో 30వేల మందిపై ప్రయోగాలు చేస్తామని వెల్లడించారు.

  ఈ వాక్సీన్‌ను అమెరికా దిగ్గజ ఔషధ సంస్థ మోడర్నా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. కరోనా వాక్సీన్ తీసుకున్న తొలి 45 మందిలో మంచి ఫలితాలు కనిపించాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. వాక్సీన్ ఇచ్చిన తర్వాత కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీలు తయారయ్యాయి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా లేవు. కొందరిలో మాత్రం ఫ్లూ లక్షణాలు కనిపించాయి. ఐతే వాంతులు, తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లేవు. నెలలో రెండు డోస్‌లు ఇవ్వాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఫైనల్ టెస్టింగ్ పూర్తైన తర్వాత ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: