ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను గడగడలాడిస్తున్న కొత్తరకం కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ కు పాకినట్లు తెలుస్తోంది. యూకే నుంచి ఢి్ల్లీ వచ్చిన మహిళకు నిర్వహించి పరీక్షల్లో కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. దీంతో ఎయిర్ పోర్ట్ అధికారులు ఆమెను క్వారంటైన్ లో ఉంచారు. ఐతే సదరు మహిళ అధికారుల కళ్లుగప్పి క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకున్నారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మహిళ మిస్సింగ్ పై ఎయిర్ పోర్ట్ అధికారులు ఏపీ అధికారులను కూడా సంప్రదించినట్లు తెలిసింది. ఐతే రాజమండ్రి వచ్చేందుకు బయలుదేరుతున్న ఆమెను, ఆమె కుమారుడ్ని అదుపులోకి తీసుకొని ఆస్పత్రికి తరలించారు. మహిళకు సోకింది సాధారణ కరోనానా..? లేక కొత్త రకం కరోనా అనేది తెలుసుకునేందుకు ఆమె బ్లడ్ శాంపిల్స్ ను పుణేలోని వైరాలజీ ల్యబ్ కు పంపించారు.
సాధారణ కరోనా కంటే కరోనా స్ట్రెయిన్ ప్రమాదకరంగా మారడంతో పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉన్నట్లు ప్రకటించింది. కొత్తరకం వైరస్ పై నిరంతరం సమీక్ష జరుపున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా తమ వివరాలని వైద్య ఆరోగ్యశాఖ వెబ్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు.
వైద్యశాఖ పోర్టల్ లో నమోదు చేసుకోని ప్రయాణికులను రాష్ట్రంలోకి అనుమతిచ్చే ప్రసక్తే లేదని ప్రభుత్వం తెలిపింది. బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రయాణికుల వివరాలను సేకరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 21వేల బృందాలు ఫీల్డ్ లెవల్లో పనిచేస్తున్నాయి. బ్రిటన్లో వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతోందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ కు సమీపంలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ లైన్ డెస్కులను ఏర్పాటు చేసింది. బ్రిటన్ నుంచి వచ్చే వారికి పపరీక్షలు నిర్వహిస్తోంది. ఒకవేళ పాజిటివ్ అని తేలితే తప్పనిసరిగా హాస్పిటల్కు పంపించి చికిత్స అందించనుండగా, నెగటివ్ వచ్చిన వారు మరో 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. క్వారంటైన్ పూర్తైన తర్వాత నిర్వహించే పరీక్షలో నెగిటివ్ అని వస్తేనే బయటకు అనుతిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం కేవలం బ్రిటన్లో మాత్రమే కొత్త స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నందున.., రాష్ట్ర పరిధిలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం అన్ని శాఖల అధికారులను ఆదేశించింది.
Published by:Purna Chandra
First published:December 24, 2020, 10:02 IST