ఏపీ, తెలంగాణ సరిహద్దులో విషాదం.. అంబులెన్స్‌లను అడ్డుకోవడంతో ఇద్దరు మృతి

ప్రతీకాత్మక చిత్రం

కర్నూలు సరిహద్దులో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ఏపీ అంబులెన్స్‌లను అనుమతించకపోవడంతో చికిత్స అందక ఇద్దరు కోవిడ్ రోగులు మరణించారు. నిన్న రాత్రి నుంచి అక్కడ 30 వరకు అంబులెన్స్‌లు నిలిచిపోయాయని స్థానికులు తెలిపారు.

  • Share this:
    ఏపీ, తెలంగాణ మధ్య కోవిడ్ చికిత్స విషయంలో గందరగోళం నెలకొంది. ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్‌లను తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ అడ్డుకుంటున్నారు. అనుమతి లేదని చెప్పి పోలీసులు నిలిపివేస్తున్నారు. అనుమతి లేనిదే తెలంగాణలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కర్నూలు సరిహద్దులో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ఏపీ అంబులెన్స్‌లను అనుమతించకపోవడంతో చికిత్స అందక ఇద్దరు కోవిడ్ రోగులు మరణించారు. నిన్న రాత్రి నుంచి అక్కడ 30 వరకు అంబులెన్స్‌లు నిలిచిపోయాయని స్థానికులు తెలిపారు. అటు గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద కూడా ఇదే పరిస్థితి. ఏపీ నుంచి తెలంగాణలోకి అంబులెన్స్‌లను అనుమతించడం లేదని ఏపీ వాసులు వాపోతున్నారు.

    కరోనా సెకండ్ వేవ్ విజృంభించిన తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి కరోనా రోగులు పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు తరలివస్తున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం అందరూ హైదరాబాద్ వైపే చూస్తున్నారు. ఈ క్రమంలో నగరంలో చాలా ఆస్పత్రుల్లో బెడ్స్ నిండిపోయాయని.. ఐనా చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. అందుకే హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో బెడ్ కన్ఫామ్ అయినట్లు పత్రాలు చూపిస్తేనే నగరంలోకి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చికిత్స కోసం వచ్చే వారికోసం ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించారు. దీనికి సంబంధించి ఇతర రాష్ట్రాల సీఎస్‌కు తెలంగాణ సీఎస్ లేఖ రాశారు.

    ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రోగులు రెండు రకాల అనుమతులు తప్పనిసరిగా ఉండాలని డీఐజీ రంగనాథ్ మీడియాకు తెలిపారు. తెలంగాణలో చికిత్స నిమిత్తం వచ్చే అంబులెన్స్‌లు, వ్యక్తిగత వాహనాలు, ప్రైవేట్ వాహనాలలో వచ్చే కోవిడ్ రోగులకు సంబంధిత ఆసుపత్రుల నుంచి జారీ చేసిన లెటర్స్‌తో పాటు హైదరాబాద్‌లోని వైద్య ఆరోగ్య, ప్రజారోగ్య కోవిడ్ కంట్రోల్ రూమ్ నుండి జారీ చేసిన పాస్ విధిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి పలువురు కోవిడ్ రోగులు అంబులెన్స్‌లో కాకుండా వ్యక్తిగత వాహనాలు, ప్రైవేట్ వాహనాలలోనూ వస్తున్నారని దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం సంబంధిత ఆసుపత్రి ఇచ్చే లెటర్‌తో పాటు విధిగా కోవిడ్ కంట్రోల్ రూమ్ ద్వారా జారీ చేయబడే పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తామని చెప్పారు.

    తెలంగాణలోకి రాకుండా ఏపీ అంబులెన్స్‌లను అడ్డుకోవడంపై ఇటీవల తెలంగాణ హైకోర్టు మండిపడింది. హైదరాబాద్ దేశంలో మెడికల్ హబ్‌గా ఉందని.. కరోనా సంక్షోభ సమయంలో అంబులెన్స్‌లను అడ్డుకోవడమేంటని మొట్టికాయలు వేసింది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అనుమతి ఇచ్చారు. ఐతే మే 13 నుంచి మళ్లీ నిలిపివేస్తున్నారు. ఆస్పత్రుల లెటర్‌తో పాటు వైద్యఆరోగ్యశాఖ కంట్రోల్ రూమ్ జారీచేసి పాస్ తప్పనిసరిగా ఉండాలని.. లేదంటే తెలంగాణలోకి పంపించమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ అధికారుల తీరుపై ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. కరోనాతో ఊపిరాడక ఇబ్బందులు పడుతుంటే.. అంబులెన్స్‌లను అడ్డుకొని ప్రాణాలు తీస్తారా? అని విమర్శిస్తున్నారు. ఈ విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: