ప్రపంచంలోని అనేక దేశాలకు వేగంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్‌లోకి కూడా ప్రవేశించింది. గత కొద్దిరోజులుగా ఈ వేరియంట్ దేశంలోకి అడుగుపెడితే ఏ విధమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందనే దానిపై కేంద్రం సమాలోచనలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో దేశంలో ఇద్దరికి ఈ కరోనా వేరియంట్ సోకినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించడం కలకలం రేపుతోంది. ఆ ఇద్దరూ కర్ణాటకకు చెందిన వారేనని.. అందులో ఒకరి వయసు 66 ఏళ్లు కాగా, మరొకరి వయసు 46 ఏళ్లు అని వైద్యశాఖ వెల్లడించింది. అయితే అధికారవర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ కేసులు ఒకదానికొకటి సంబంధం లేవని, వారిద్దరికీ పూర్తిగా టీకాలు వేయబడ్డాయని తెలిసింది. వీరిలో 66 ఏళ్ల వ్యక్తి దక్షిణాఫ్రికా జాతీయుడు. ఆయన దక్షిణాఫ్రికా నుండి వచ్చారు. ఆయనకు ట్రావెల్ హిస్టరీ ఉంది.
అయితే మరొకరికి మాత్రం ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు. ఆయన బెంగళూరుకు చెందిన ఆరోగ్య సంరక్షణ కార్యకర్త. వీరిద్దరికీ నవంబర్ 22న పరీక్షలు నిర్వహించగా.. తేలికపాటి లక్షణాలతో పాజిటివ్‌గా తేలింది. వీరిలో 66 ఏళ్ల దక్షిణాఫ్రికా జాతీయుడు.. నవంబర్ 20న బెంగుళూరుకు వచ్చారు. ఆయన రాగానే విమానాశ్రయంలో అతని నమూనా సేకరించిన తర్వాత పాజిటివ్ అని తేలింది. ఆయతను నెగిటివ్ సర్టిఫికెట్‌తో దక్షిణాఫ్రికా నుండి దుబాయ్ మీదుగా ప్రయాణించారు. ఆయనను ఐసొలేషన్ కోసం హోటల్‌కు వెళ్లాలని సూచించారు.
నవంబర్ 22న ఆయన నుంచి పరీక్షల కోసం నమూనాలను తీసుకుని జెనోమిక్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. అనంతరం ఆయన నవంబర్ 23న ఒక ప్రైవేట్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించుకున్నారు. అక్కడ ఆయనకు నెగిటివ్ వచ్చిందని. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) కమిషనర్ గౌరవ్ గుప్తా తెలిపారు. ఆయనకు సంబంధించి 24 ప్రైమరీ కాంటాక్ట్‌లు, 240 సెకండరీ కాంటాక్ట్‌లు ఉన్నాయని, వారందరికీ నెగెటివ్ అని తేలిందని సంబంధించి వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆ దక్షిణాఫ్రికా జాతీయుడు నవంబర్ 27న తిరిగి దుబాయ్ వెళ్లిపోయారు.
ఇక బెంగళూరు నివాసి అయిన 45 ఏళ్ల వ్యక్తికి జ్వరం, శరీర నొప్పి లక్షణాలు కనిపించాయని గుప్తా తెలిపారు. ఆయన నమూనాలను నవంబర్ 22న ఆసుపత్రిలో తీసుకున్నారు. ఆయనకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. అయితే ఆ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను పంపారు. ఆయన నవంబర్ 22-24 మధ్య హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆ తర్వాత మూడు రోజులు ఆసుపత్రిలో ఉన్నారు. నవంబర్ 27న ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు సంబంధించి 13 ప్రైవరీ కాంటాక్ట్‌లు ఉన్నాయి. వారిలో ముగ్గురిని పరీక్షించారు. 205 సెకండరీ కాంటాక్ట్‌లు కొనుగొన్నారు. వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. పాజిటివ్ రోగులందరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్లు గుప్తా తెలిపారు.
ఇండియాలోకి ప్రవేశించిన కరోనా ఒమైక్రాన్.. రెండు కేసులు నమోదు
Omicron Variant: ఒమిక్రాన్ వేరియెంట్ మొదట ఎలా బయటపడిందంటే.. రిపోర్ట్ చూసి సైంటిస్ట్ షాక్
మొదటి రెండు ఒమిక్రాన్ కేసులను గుర్తించిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా, యూరోపియన్ దేశాల నుండి వచ్చే ప్రయాణికులపై ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను జారీ చేస్తుందని, కఠినమైన నిఘా ఉంచుతుందని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. ఈ విషయంలో తాము సిద్ధంగానే ఉన్నామని.. ట్రాకింగ్, టెస్టింగ్ విషయంలో రాష్ట్రం జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉందని న్యూస్ 18 ఇండియా చౌపాల్‌లో వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Omicron, Omicron corona variant