HOME »NEWS »Corona vilayatandavam »turmeric milk to immunity supplements home remedies gain popularity during covid 19 pandemic su gh

Ayurvedic Medicine: కరోనా నివారణకు ఆయుర్వేదం సరైన ఎంపికేనా?

Ayurvedic Medicine: కరోనా నివారణకు ఆయుర్వేదం సరైన ఎంపికేనా?
ఆయుర్వేద ఉత్పత్తులు

దేశంలో మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో చాలామంది ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెట్టారు. పతంజలి వంటి సంస్థల నుంచి వచ్చిన ఆయుర్వేద ఉత్పత్తులను వాడేవారి సంఖ్య పెరిగింది.

  • Share this:
దేశంలో మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో చాలామంది ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెట్టారు. పతంజలి వంటి సంస్థల నుంచి వచ్చిన ఆయుర్వేద ఉత్పత్తులను వాడేవారి సంఖ్య పెరిగింది. కరోనావైరస్ ముప్పు నుంచి ఆయుర్వేద ఉత్పత్తులు తమను రక్షిస్తాయని చాలామంది నమ్ముతున్నారు. కరోనా వెలుగు చూసినప్పటి నుంచి రోగనిరోధక శక్తిని బలోపోతం చేసుకోవడానికి భారతీయులు ఆయుర్వేద పద్ధతుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీన్ని గుర్తించిన కొన్ని కంపెనీలు పసుపు పాలు, తులసి చుక్కల ఔషధం వంటి వాటిని ప్యాకేజీ ఉత్పత్తులుగా మార్చి అమ్ముతున్నాయి.

ఆయుర్వేద చికిత్సలు కరోనావైరస్ను నివారించగలవని చెప్పేందుకు ఇప్పటి వరకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. నిజానికి మహమ్మారికి ముందే ఈ రంగం భారీగా విస్తరించింది. ఆయుర్వేదం, ఇతర సహజ నివారణ పద్ధతులు జలుబు వంటి సాధారణ అనారోగ్యాల నుంచి క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్యాల వరకు ప్రతిదీ నయం చేస్తాయని ప్రజలు నమ్ముతున్నారు. మరోపైపు కరోనా కేసుల జాబితాలో భారతదేశం ప్రపంచంలో రెండో స్థానానికి చేరుకుంది. మొత్తం కేసులు ఎనిమిది మిలియన్లు దాటాయి. మరణాల సంఖ్య 1,20,000 దాటింది. పరీక్షలు సరిగా చేయకపోవడం, పూర్తి స్థాయిలో కేసులను బయట పెట్టకపోవడం వల్ల కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య ప్రభుత్వాలు చెప్పేదానికన్నా ఎక్కువగా ఉండవచ్చని కొంతమంది నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.మార్కెట్ వాటా పెరిగింది.
ఆయుర్వేద ఉత్పత్తుల మార్కెట్ వాటా సంవత్సరానికి 10 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ తెలిపింది. కరోనావైరస్కు వ్యాక్సిన్, ఇతర చికిత్సలు అందుబాటులో లేకపోవడం వల్ల అందుబాటులో ఉన్న సహజ నివారణ పద్ధతులైన ఆయర్వేదం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని ఆయుర్వేద నిపుణురాలు భాస్వతి భట్టాచార్య చెబుతున్నారు. ‘ఆయుర్వేద గ్రంథాలను 5,000 సంవత్సరాల క్రితమే రాశారని అంచనా. ప్లేగు, మశూచి, మహమ్మారులు వ్యాపింపనప్పుడు కూడా ఇది అందుబాటులో ఉంది. అందుకే ఇప్పటి ప్రజలు ఇది పనిచేస్తుందో లేదో చూద్దామనే ఉద్దేశంతో వాటిని వాడటం మొదలుపెట్టారు’ అని ఆమె చెప్పారు.

 ప్రభుత్వ ప్రోత్సాహం కూడా...
ఆయుర్వేదం, ఇతర సహజ చికిత్సలను ప్రభుత్వం ముందు నుంచి ప్రోత్సహిస్తోంది. 2014 లో ఇందుకు ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను సైతం ఏర్పాటు చేసింది. జనవరిలో ఆయుష్ మంత్రిత్వ శాఖ (ఆయుర్వేదం, యోగా, ప్రకృతివైద్యం, యునాని, సిద్ధ, సోవా రిగ్పా, హోమియోపతి) కరోనావైరస్ను ఎదుర్కోవటానికి సాంప్రదాయ నివారణ మార్గాలను సూచించింది. తేలికపాటి లక్షణాలతో వ్యాపించే కరోనా వైరస్ బాధితులకు ఆయుర్వేదం, యోగాతో చికిత్స చేయడానికి మార్గదర్శకాలను కూడా ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ విడుదల చేశారు.

డిమాండ్ పెరిగింది
మెడికల్ షాపుల నిర్వాహకులు ఆయుర్వేద ఉత్పత్తులను ఇతర మందుల మాదిరిగానే ప్రత్యేకంగా అమ్మకానికి ఉంచుతున్నారు. ఇటీవల పిల్లల కోసం ప్రారంభించిన పసుపు పాలకు వినియోగదారుల నుంచి అసాధారణమైన స్పందన లభించిందని ప్రముఖ పాల ఉత్పత్తిదారీ సంస్థ మదర్ డెయిరీ తెలిపింది. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ట్యూమరిక్ మిల్స్ ఉత్పత్తి, పంపిణీని పెంచుతున్నామని మదర్ డెయిరీ ప్రొడక్ట్స్ చీఫ్ సంజయ్ శర్మ తెలిపారు. ఆరోగ్య సంరక్షణ కోసం రోగనిరోధక శక్తి పెంచే ఉత్పత్తుల వాడకం పెరిగిందని హిమాలయ డ్రగ్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫిలిప్ హేడాన్ చెబుతున్నారు. తక్కువ ధరల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంచిన రోగనిరోధక శక్తిని పెంచే ఉత్పత్తులకు మహమ్మారి తరువాత 10 రెట్లు డిమాండ్ పెరిగిందని ఆయన తెలిపారు.

అనుమానాలు ఉన్నాయి
ఆయుర్వేద చికిత్సలు, ఉత్పత్తులకు ఆధరణ పెరుగుతున్నప్పటికీ, వాటిపై అనుమాలు సైతం పెరుగుతున్నాయి. శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా బీజేపీకి చెందిన కొందరు రాజకీయ నాయకులు వైరస్ను నయం చేయడానికి ఆవు పేడ, మూత్రాన్ని ఉపయోగించాలని సూచించారు. జూన్లో పతంజలి సంస్థ విడుదల చేసిన "కరోనిల్" మూలికా ఔషధం అమ్మకాలను ఆపేయాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతకు ముందు కరోనిల్ కరోనాను అంతం చేసే ఔషధమని బాబా రామ్ధేవ్ ప్రకటించారు. వైరస్ చికిత్సలో ఆయుర్వేదం, యోగా ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని చెప్పేందుకు సాక్ష్యాలను అందించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆరోగ్య మంత్రిని స్వయంగా కోరింది. కోవిడ్ -19ను అరికట్టడానికి ఇలాంటివేవీ ప్రత్యేకమైన రక్షణను ఇవ్వవని న్యూ దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ ఆనంద్ కృష్ణన్ చెబుతున్నారు. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించడం, చేతులు కడుక్కోవడం వంటి అలవాట్లను పాటించడం ముఖ్యమని ఆయన వివరించారు.
Published by:Sumanth Kanukula
First published:October 30, 2020, 15:21 IST