news18
Updated: October 3, 2020, 8:13 AM IST
డోనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫొటో)
- News18
- Last Updated:
October 3, 2020, 8:13 AM IST
తాను మాస్కు పెట్టుకోనని, కరోనా తనను ఏమీ చేయలేదని చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఆయన భార్యకు కూడా ఈ వైరస్ సోకిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ నిర్ధారణ కాగానే వారిద్దరూ క్వారంటైన్ కు వెళ్లారు. కాగా, కరోనా వచ్చిన 17 గంటల తర్వాత ట్రంప్ దంపతులను మేరీల్యాండ్ లోని బెథెస్డాలో ఉన్న వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. క్వారంటైన్ లో ఉన్న ట్రంప్ దంపతులు.. హాస్పిటల్ కు వెళ్లడానికి ఏర్పాటుచేసిన ప్రత్యేక హెలికాప్టర్ లో వారు ఆస్పత్రికి చేరుకున్నారు. హాస్పిటల్ కు తీసుకెళ్తున్న సమయంలో ట్రంప్.. ముఖానికి మాస్కుతో పాటు ప్రత్యేక మైన బిజినెస్ సూట్ ను దరించారు. కరోనా తగ్గే దాకా ఆయన మిలిటరీ హాస్పిటల్ నుంచే పనిచేస్తారని వైట్ హౌస్ వర్గాలు చెప్పాయి. అందుకు తగిన ఏర్పాట్లన్నీ పూర్తయినట్టు తెలుస్తున్నది. హస్పిటల్ కు చేరిన తర్వాత ట్రంప్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘నేను చాలా బాగున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు.
ఏం మందులు ఇస్తున్నారు : ట్రంప్ వయస్సు 74 సంవత్సరాలు. ఒకరకంగా ఆయనకు ఇది కొంచెం ఇబ్బందిపెట్టే విషయమే. ఈ వయసులో కరోనా సోకినవారికి మిగతా ఆరోగ్య సమస్యలేమైనా ఉంటే అది వారి ప్రాణాలకే ముప్పు. కొద్దిపాటి జ్వరంతో ఆయన బాధపడుతున్నారని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు వైట్ హౌస్ డాక్టర్లు ప్రత్యేక కేర్ తీసుకుంటున్నారు. ఇందుకు గానూ ట్రంప్ ఆరోగ్య వ్యవహారాలు చూసే డాక్టర్ సేన్ పి. కోన్లే.. ఆయనను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయనకు అమెరికాలో కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తయారుచేస్తున్న ఔషధాన్ని ఆయనకు ఇస్తున్నట్టు తెలిసింది. ఇదే విషయమై కోన్లే స్పందిస్తూ.. ‘ట్రంప్ కు రెజెనెరన్ (ఆర్ఈజీఎన్.0, ఆర్ఈజీఎన్-సీవోవీ2) లను ఇస్తున్నాం. ఈ డ్రగ్ కరోనా వ్యాక్సిన్ కోసం తయారుచేస్తున్న దాంట్లో ప్రయోగాత్మకంగా వాడుతున్నాం. దీని ద్వారా మనుషుల్లో యాంటీ బాడీలు వృద్ధి చెందుతాయి..’ అని తెలిపారు. ఇదొక్కటే గాక ఆయనకు జింక్, విటమిన్ డి, ఫమోటైడైన్, అస్పిరిన్ కూడా ఇస్తున్నట్టు చెప్పారు. మరోవైపు ట్రంప్ దంపతులకు కరోనా అని తేలడంతో వాల్ స్ట్రీట్ వీధులన్నీ నిన్న వెలవెలబోయాయయి. సమయానికంటే ముందే దానిని మూసేశారు.
ప్రచారం మీద ప్రభావం :
ఇక ఆయనకు కరోనా రావడం అధ్యక్ష ఎన్నికల ప్రచారం మీద తీవ్రంగా పడనుంది. దాదాపు ముగింపు దశకు వచ్చిన సమయంలో ఆయనకు వైరస్ ఎటాక్ కావడంతో కొద్దిరోజుల పాటు ప్రచారసభలకు దూరంగా ఉండాల్సిందే.. మరోవైపు సర్వేలలో ఆయన ప్రత్యర్థి జో బిడెన్ అధ్యక్ష పదవి రేసులో ముందున్నాడని తేల్చుతుండటం ట్రంప్ కు ఇబ్బందికర పరిస్థితులను తీసుకొస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అధ్యక్షుడికి ఏమైనా అయితే.. :
వయసు రిత్యా ట్రంప్ కు కరోనా కారణంగా జరగరానిదేమైనా జరిగితే తర్వాత ఏం చేయాలనే చర్చ అప్పుడే మొదలైంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు ఆస్పత్రి పాలైతే.. ఉపాధ్యక్షుడు బాధ్యతలు చేపట్టాలి. అయితే ఇది అధ్యక్షుడు బదలాయించొచ్చు. లేదా ఆయన ఆ పరిస్థితుల్లో లేనపుడు ఉపాధ్యక్షుడే నేరుగా చేపడతాడు. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కొద్దిరోజులుగా తన స్వస్థలమైన ఇండియానా నుంచే పనిచేస్తున్నారు. ఆయన కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నారు. కానీ కరోనా నెగిటివ్ అని తేలింది. ట్రంప్ కోలుకోకుంటే.. తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేది మైక్ పెన్సే.
Published by:
Srinivas Munigala
First published:
October 3, 2020, 8:11 AM IST