news18-telugu
Updated: November 27, 2020, 4:19 PM IST
ప్రధాని మోదీ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) రేపు హైదరాబాద్‌తో పాటు అహ్మదాబాద్, పూణెలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వాక్సిన్ గురించి చర్చ జరుగుతున్న వేళ.. కోవిడ్ (Covid-19) వాక్సిన్ అభివృద్ధిపై ప్రధాని మోదీ సమీక్షించనున్నారు. మనదేశంలో మూడు వాక్సిన్లు ప్రస్తుతం మూడో దశ ప్రయోగాల్లో ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ (Bharat biotech) కంపెనీ కొవాక్జిన్ (Covaxin), అహ్మదాబాద్‌కు చెందిన జైడుస్ క్యాడిల్లా కంపెనీ జైకోవ్-డీ (ZyCoV-D) వాక్సిన్ను అభివృద్ధి చేస్తున్నాయి. ఇక పుణెకు చెందిన సీరస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకొని.. భారత్‌లో ఆస్ట్రజెనికా-ఆక్స్ఫర్డ్ ( AstraZeneca-Oxford) వాక్సిన్ను తయారు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ మూడు నగరాల్లో శనివారం పర్యటించబోతున్నారు ప్రధాని మోదీ.
కరోనాపై జరుగుతున్న పోరాటం మనదేశంలో నిర్ణయాత్మక దశలో ఉన్నందున.. హైదరాబాద్, అహ్మదాబాద్, పుణెలోని పరిశోధనా కేంద్రాలను ప్రధాని మోదీ సందర్శించనున్నారు. అక్కడ శాస్త్రవేత్తలతో సమావేశమై వ్యాక్సిన్ అభివృద్ధి గురించి చర్చిస్తారు. వాక్సిన్ పంపిణీకి సన్నద్ధత, రోడ్ మ్యాప్, సవాళ్ల గురించి వారితో చర్చలు జరపనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మధ్యాహ్నం పుణె నుంచి హైదరాబాద్‌కు వస్తారు. ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్ విమానంలో హకీంపేట ఎయిర్‌బేస్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచిరోడ్డు మార్గంలో జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ కంపెనీకి వెళ్తారు. సుమారు గంటల పాటు శాస్త్రవేత్తలతో సమాశమై కోవిడ్ వాక్సిన్ గురించి చర్చిస్తారు. తిరిగి హకీంపేట ఎయిర్‌పోర్టు చేరుకొని.. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి గురువారం రాత్రి తెలంగాణ చీఫ్ సెక్రటరీ మెమో జారీ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో... నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
కాగా, కొవాగ్జిన్ భారత్‌కు చెందిన తొలి స్వదేశీ కరోనా వ్యాక్సిన్. దీనిని భారత్ బయోటెక్ కంపెనీ, ఐసీఎంఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తాయి. తొలి రెండు దశ ప్రయోగాలు విజయవంతం కావడంతో.. ఇటీవలే దేశవ్యాప్తంగా మూడో దశ ప్రయోగాలను ప్రారంభించారు. తుది దశ ప్రయోగాలు సక్సెస్ అయితే అతి త్వరలోనే వాక్సిన్ పంపిణీని ప్రారంభిస్తుంది కేంద్ర ప్రభుత్వం.
Published by:
Shiva Kumar Addula
First published:
November 27, 2020, 4:05 PM IST