కరోనా వైరస్ కట్టడికి ప్రపంచదేశాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రస్తుతం ప్రపంచదేశాల చూపు కరోనా వ్యాక్సిన్ పైనే ఉంది. ఇందులో భాగంగా కరోనా మహమ్మారి కట్టడికి పలు ఫార్మా కంపెనీలు తయారు చేస్తున్న వ్యాక్సిన్లు కీలక దశకు చేరుకున్నాయి. అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్, ఎలి లిల్లీ ఫార్మా సంస్థలు ఇప్పటికే రెండు దశల్లో వాక్సిన్ ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకోగా, ఈ వారం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ చేపట్టాల్సి ఉంది. అయితే, వ్యాక్సిన్ పరీక్షలు ఆశాజనకంగా సాగుతున్న క్రమంలో జాన్సన్ అండ్ జాన్సన్ మరియు ఎలి లిల్లీ ఫార్మా సంస్థలు కీలక ప్రకటన చేశాయి. భద్రతాపరమైన కారణాలతో మూడో దశ లేదా చివరి దశ క్లినికల్ ట్రయల్స్ నిలిపివేస్తున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. వ్యాక్సిన్ ప్రయోగించిన వాలంటీర్లలో ఇద్దరు అస్వస్థతకు గురికావడంతో టీకా క్లినికల్ ట్రయల్స్ ను నిలిపేస్తున్నట్లు పేర్కొన్నాయి.
‘‘భారీ అధ్యయనాల్లో ఇటువంటి ప్రతికూల అవాంతరాలు ఊహించినవేనని, క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, స్వతంత్ర డేటా భద్రత పర్యవేక్షణ బోర్డు (డీఎస్ఎంబీ) మరియు అంతర్గత భద్రతా వైద్యులు దీనిపై సమీక్షిస్తున్నారని’’ జాన్సన్ అండ్ జాన్సన్ పేర్కొంది. వ్యాక్సిన్ ట్రయల్స్ ఆలస్యమవడానికి గల కారణాలను పరిశీలించి, త్వరలోనే ట్రయల్స్ ను పునరుద్ధరిస్తామని తెలిపింది. కాగా, ఇటీవల ఆస్ట్రాజెనెకా ఫార్మా కంపెనీ కూడా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొని మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ను నిలిపివేసింది. అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా 200 కేంద్రాల్లో 60 వేల మంది వాలంటీర్లపై భారీగా మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు సెప్టెంబర్‌లో జాన్సన్ అండ్ జాన్సన్ వాలంటీర్ల రిక్రూట్మెంట్ ను ప్రారంభించింది. అయితే, క్లినికల్ ట్రయల్స్ లో అంతరాయం ఏర్పడటంతో తాజాగా రిక్రూట్మెంట్ ను నిలిపివేసింది.
దీనిపై పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ మరియు ఎఫ్‌డీఏ వ్యాక్సిన్ అడ్వైజరీ ప్యానెల్ సభ్యుడు డాక్టర్ పాల్ ఆఫిట్ మాట్లాడుతూ,.. ‘‘క్లినికల్ ట్రయల్స్ ను ఆపేయడం చాలా పెద్ద సవాల్, ముఖ్యంగా 10 దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న జాన్సన్ & జాన్సన్‌కి ఇది ఇబ్బందికర పరిణామం అనే చెప్పాలి. దీంతో కరోనా వ్యాక్సిన్ మరింత ఆలస్యం కానుంది.’’ అని ఆయన అన్నారు. టీకాల కోసం - జాన్సన్ & జాన్సన్, ఆస్ట్రాజెనెకా మరియు ఎలి లిల్లీ వంటి ఔషధ సంస్థలే చేపట్టిన ట్రయల్స్‌ను నిలిపివేసే విధానంలో కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. ఈ టీకాలు మిలియన్ల లేదా బిలియన్ల ఆరోగ్యకరమైన ప్రజలకు ఇవ్వడానికి రూపొందించబడుతున్నాయి. కాబట్టి, వారి భద్రతను దృష్టిలో పెట్టుకొని టీకా ఆలస్యమైనప్పటికీ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Published by:Nikhil Kumar S
First published:October 15, 2020, 19:19 IST