China: చైనాలో మరో మహమ్మారి...భయం గుప్పిట్లో జనం...

వాయువ్య చైనాలో కొన్ని వేల మంది ప్రజలు బ్రూసెలోసిస్ అనే వ్యాధి బారిన పడుతున్నారు. ఇది ఒక బ్యాక్టీరియా కారణంగా వ్యపిస్తోందని అక్కడి వైద్యులు చెబుతున్నారు.

news18-telugu
Updated: September 18, 2020, 7:06 PM IST
China: చైనాలో మరో మహమ్మారి...భయం గుప్పిట్లో జనం...
ప్రతీకాత్మక చిత్రం (credit - NIAID)
  • Share this:
ఇప్పుడిప్పుడే కరోనా వ్యప్తిని అదుపులోకి తీసుకువస్తున్న చైనాకు మరో ఆరోగ్య విపత్తు తప్పేలా లేదు. ఇంతకు ముందు ఆ దేశంలో వెలుగుచూసిన వైరస్ ప్రపంచం మొత్తాన్ని స్తంభింపజేసింది. ఇప్పుడు ఒక బ్యాక్టీరియా అక్కడి ప్రజలను భయపెడుతోంది. వాయువ్య చైనాలో కొన్ని వేల మంది ప్రజలు బ్రూసెలోసిస్ అనే వ్యాధి బారిన పడుతున్నారు. ఇది ఒక బ్యాక్టీరియా కారణంగా వ్యపిస్తోందని అక్కడి వైద్యులు చెబుతున్నారు. ఈ మంగళవారం చైనా అధికారులు సైతం దీన్నిధ్రువీకరించారు. గత సంవత్సరం బయోఫార్మాస్యూటికల్ కంపెనీ నుంచి లీకయిన బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తున్నట్టు తెలుస్తోంది.

పశువులపై ఉండే బ్యాక్టీరియానే కారణం

పశువులపై ఉండే బ్రూసెల్లా అనే బ్యాక్టీరియా కారణంగా వ్యాధి వ్యాపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. చైనాలోని గన్సు ప్రావిన్స్ రాజధాని లాన్జౌలో ఈ బ్యాక్టీరియా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు 3,245 మందికి బ్రూసెలోసిస్ వ్యాధి వచ్చినట్టు లాన్జౌ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. ఈ వ్యాధి సోకిన వారిలో శరీర భాగాల్లో వాపు, వృషణాలు ఎర్రబడటం, సంతానానికి పనికిరాకుండా పోవడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు.

అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(CDC) కూడా ఈ వ్యాధి వ్యాప్తిపై ప్రకటన చేసింది. బ్రూసెల్లా బ్యాక్టీరియా కారణంగా మాల్టా ఫీవర్ లేదా మెడిటేరియన్ ఫీవర్ వస్తుందని సీడీసీ చెబుతోంది. ఇది తలనొప్పి, కండరాల నొప్పి, జ్వరం, అలసటను కలిగిస్తుందని పేర్కొంది. ఈ లక్షణాలు తగ్గినా, మరికొన్ని లక్షణాలు దీర్ఘకాలికంగా వేధించే ప్రమాదం ఉంది. బ్యాక్టీరియా కారణంగా కొన్ని శరీర భాగాల్లో ఏర్పడే వాపు ఎప్పటికీ పోదు.

మనుషులకు సోకుతుందా?
ఈ వ్యాధిలో మనుషులకు సోకడం, ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం చాలా అరుదని సీడీసీ చెబుతోంది. కుళ్లిపోయిన, పాడైపోయిన ఆహారాన్ని తీసుకోవడం, శ్వాస తీసుకున్నప్పుడు శరీరంలోకి బ్యాక్టీరియా వెళ్లడం ద్వారా బ్రూసెలోసిస్ వ్యాపించే అవకాశం ఉందని ఆ సంస్థ చెబుతోంది. శ్వాస ద్వారానే లాన్జౌలో ఈ బ్యాక్టీరియా మనుషుల శరీరంలోకి వెళ్లి వ్యాధికి కారణమై ఉండొచ్చని తెలిపింది.

సీఎన్ఎన్ కొత్త వాదనసీఎన్ఎన్ వార్తా సంస్థ మాత్రం ప్రయోగశాల నుంచే ఈ బ్యాక్టీరియా వ్యాపించిందని చెబుతోంది. గత సంవత్సరం జూలై, ఆగస్టు మధ్యలో లాన్జౌ బయోలాజికల్ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ నుంచి బ్యాక్టీరియా లీక్ అయినట్టు తెలిపింది. జంతువుల కోసం బ్రూసెల్లా వ్యాక్సిన్ను ఉత్పత్తి చేస్తున్నప్పుడు పొరపాటున బ్యాక్టీరియా లీకైందని పేర్కొంది. ఆ ఫ్యాక్టరీ గడువు ముగిసిన క్రిమిసంహారక మందులు, శానిటైజర్లను ఉపయోగించడంతో లీకైన బ్యాక్టీరియా పూర్తిగా చనిపోలేదని, ఇదే ఇప్పుడు కొత్త వ్యాధికి కారణమని సీఎన్ఎన్ విశ్లేషిస్తోంది. ఈ వ్యాధి వెలుగు చూసిన కొత్తలో తక్కువ కేసులే నమోదు కావొచ్చని వైద్యులు భావించారు. కానీ పరీక్షలు పెంచేకొద్దీ వ్యాధి సోకినవారి సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు 21,000 మందికి పరీక్షలు నిర్వహించారు. దీని కారణంగా ఒక్కరు కూడా చనిపోలేదని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రకటించింది.
Published by: Krishna Adithya
First published: September 18, 2020, 7:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading