Corona third wave: ఈ దేశాల్లో కరోనా మూడో దశ.. అక్కడ ఎలాంటి ఆంక్షలు ఉన్నాయంటే...

Corona third wave: ఈ దేశాల్లో కరోనా మూడో దశ.. అక్కడ ఎలాంటి ఆంక్షలు ఉన్నాయంటే...

(ప్రతీకాత్మక చిత్రం )

Corona third wave: బ్రిటన్‌లో గుర్తించిన B117 మ్యుటేషన్ వంటి కొత్త కరోనా రూపాంతరాలు తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. కొన్ని దేశాల్లో గుర్తించిన వేరియెంట్లు ప్రమాదకరంగా మారుతున్నాయి.

  • Share this:
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా రెండో దశలో విజృంభిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే వైరస్ బలంగా రూపాంతరం చెందింది. దీని వ్యాప్తి, తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోంది. ప్రపంచ దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియతో మహమ్మారిని నిరోధించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని దేశాల్లో వైరస్ మూడో దశ వ్యాప్తి కూడా పెరుగుతోంది. దీంతో మళ్లీ లాక్‌డౌన్‌లు, ఆంక్షలు అనివార్యమయ్యాయి. బ్రిటన్‌లో గుర్తించిన B117 మ్యుటేషన్ వంటి కొత్త కరోనా రూపాంతరాలు తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. కొన్ని దేశాల్లో గుర్తించిన వేరియెంట్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ దేశాలు వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేపట్టిన చర్యలను పరిశీలిద్దాం.

* ఫ్రాన్స్
కోవిడ్-19 కేసుల పెరుగుదలను నిరోధించడానికి ఫ్రాన్స్ ఏప్రిల్ ప్రారంభంలో మూడోసారి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఏప్రిల్ నెలాఖరు వరకు అన్ని పాఠశాలలు, షాపింగ్ మాల్స్, అన్ని రకాల వాణిజ్య సముదాయాలను మూసివేశారు. ప్రతిరోజు రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. గురువారం నాటికి కోవిడ్-19 మహమ్మారి దేశంలో లక్షమందికి పైగా బలితీసుకుంది. దీంతో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఫ్రాన్స్ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేస్తోంది. ఏప్రిల్ 14 నాటికి దేశంలో మొత్తం 15.75 మిలియన్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చారు. వీటిలో 11.6 మిలియన్లు ఫస్ట్ డోస్ వ్యాక్సిన్లు ఉన్నాయి.

* జర్మనీ
జర్మనీలో ఫిబ్రవరిలో పాఠశాలలను తిరిగి ప్రారంభించారు. ఆ తరువాత మార్చిలో షాపింగ్ మాల్స్, అన్ని వ్యాపార సముదాయాలు తెరచుకున్నాయి. ప్రస్తుతం దేశంలో పాక్షిక లాక్‌డౌన్ అమలవుతోంది. ఏప్రిల్ 18 వరకు ఆంక్షలు విధించారు. కేసుల తీవ్రత, మరణాల రేటు తగ్గకపోవడంతో జర్మనీ ఈ ఆంక్షలను పొడిగించే అవకాశం ఉంది. గురువారం దేశ వ్యాప్తంగా 29,000 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో అధిక శాతం 15 నుంచి 49 సంవత్సరాల వయసు వారం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మొదటి, రెండో దశలో వైరస్ బారిన పడినవారికంటే చాలా తక్కువ వయసున్న వారికి ప్రస్తుతం కోవిడ్-19 వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు జర్మనీలో దాదాపు 80,000 మంది వైరస్‌తో చనిపోయారు. దాదాపు 5,000 ఐసీయూ పడకలను కోవిడ్-19 రోగులకు కేటాయించారు. ఈ సంఖ్య ఏప్రిల్ చివరి నాటికి 6,000కు పెరగవచ్చు. మహమ్మారి తీవ్రత తగ్గనందువల్ల ఆంక్షలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది.

* ఇటలీ
ఇటలీలో ముందు నుంచి కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ జనవరిలో వారానికి సగటున 12,000 వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... మార్చి, ఏప్రిల్‌లో ఈ సంఖ్య 20,000కు పెరిగింది. గత 24 గంటల్లో దేశంలో 16,160 కొత్త కేసులను గుర్తించారు. ఆ దేశంలో ఇప్పటి వరకు 38 లక్షలకు పైగా కరోనా కేసులు బయటపడ్డాయి. ఇటలీలో 2020 జనవరి 3 నుంచి 2021 ఏప్రిల్ 15 వరకు 1,15,557 కోవిడ్ మరణాలు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దేశంలో ప్రతి లక్ష మందికి 250 కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలను రెడ్ జోన్‌లో చేరుస్తున్నారు. ఇక్కడ బార్లు, రెస్టారెంట్లు, పాఠశాలలు, మాల్స్ అన్నీ మూసివేస్తున్నారు.

* నెదర్లాండ్స్
నెదర్లాండ్స్‌లో కేసుల పెరుగుదల కారణంగా రాత్రి పూట కర్ఫ్యూ, ఇతర ఆంక్షలు విధిస్తున్నారు. ఇవి ఏప్రిల్ 28 వరకు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌డౌన్ నిబంధనలను సడలించడం కుదరదని డచ్ ప్రభుత్వం గురువారం తెలిపింది. దేశంలో బుధవారం కొత్తగా 5,503 కేసులు నమోదయ్యాయి. మార్చితో పోలిస్తే రోజువారీ కేసుల్లో 35 శాతం పెరుగుదల ఉంది. ఏప్రిల్ 21న ఆంక్షలను సడలించడంపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం గతంలో తెలిపింది. కర్ఫ్యూను ఎత్తివేసి బార్లు, రెస్టారెంట్లు, ఇతర దుకాణాలను తిరిగి తెరవడంపై ఆలోచిస్తామని ప్రభుత్వం ఇంతకు ముందు తెలిపింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ అమలయ్యే సూచనలు కల్పిస్తున్నాయి.

* కెనడా
కెనడాలో కొత్త వైరస్ మ్యుటేషన్ విజృంభిస్తోంది. దేశంలో కోవిడ్ మూడో దశలో వ్యాప్తి చెందుతోంది. కొత్తగా రూపాంతరం చెందిన వైరస్ ప్రమాదకరంగా మారుతోంది. కెనడాలో గత వారంలో రోజుకు సగటున 5,200 కొత్త కరోనావైరస్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకు పది లక్షలకు పైగా పాజిటివ్ కేసులు, 23,000 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. దేశంలో అత్యధిక జనాభా ఉన్న నగరమైన ఒంటారియోలో ప్రభుత్వం పాక్షిక లాక్‌డౌన్ విధించింది. ఇతర ప్రాంతాల్లోనూ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

* పోలాండ్
గతంలో ప్రకటించిన లాక్‌డౌన్‌ను పోలాండ్ ప్రభుత్వం ఏప్రిల్ 25 వరకు పొడిగించింది. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో కేసులు పెరుగుతున్నందువల్ల ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. బుధవారం పోలాండ్‌లో 21,283 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు 26 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 59,930గా ఉంది. ప్రార్థనా స్థలాలు, దుకాణాల్లో 20 చదరపు మీటర్ల వ్యక్తిగత దూరం, 2,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న దుకాణాలను మూసివేయడం వంటి ఆంక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. హోటళ్లు, లాడ్జిలను మే 3 వరకు మూసివేసి ఉంచనున్నారు.
First published:

అగ్ర కథనాలు