చనిపోయిన వ్యక్తిని స్మశానానికి తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో చెత్తబండిలోనే తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించిన విషాద ఘటనిది. పెద్దపల్లి జిల్లాలో చేసుకున్న ఈ హృదయవిదారక ఘటన పలువురిని కలచివేసింది.
కరోనా వైరస్ తాలూకు భయాందోళనలు ప్రజల్లో రోజురోజూకీ ఎక్కువైపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతలా లాక్డౌన్ ప్రకటించిన సందర్భాలు లేవు. దీంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తుతున్నాయి. అవి ఏందాకంటే.. కనీసం మనిషి చనిపోతే.. పాడె పట్టేందుకు కావాల్సిన నలుగురు దగ్గరికి రాలేని దయనీయ స్థితి నెలకొంది. అందులో భాగంగానే పెద్దపల్లి జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తిని స్మశానానికి తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో చెత్తబండిలోనే తీసుకెళ్లిన విషాద ఘటనిది.. పూర్తి వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారానికి చెందిన కోసరి రాజవ్వ, అంజయ్య దంపతులకు సంతానం లేరు. భర్త రెండు నెలల క్రితమే చనిపోయాడు.
అప్పటి నుంచి మానసిక వేదనతో మంచం పట్టిన రాజవ్వ గురువారం మరణించింది. ఈ విషయాన్ని స్థానికులు రాజవ్వ బంధువులకు సమాచారం ఇచ్చారు. అయితే కరోనా వైరస్ భయంతో ఎవ్వరూ రాజవ్వ కడచూపునకు రాలేదు. దీంతో దాదాపు 24 గంటల పాటు ఎవరైనా బంధువులు వస్తారేమోనని ఎదురుచూశారు. అయినా ఎవ్వరూ రాకపోవడంతో చివరకు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది రాజవ్వ మృతదేహాన్ని చెత్తను తీసుకెళ్లే బండిలో అంతిమయాత్రను నిర్వహించారు. అనంతరం దహన సంస్కారాలను పూర్తిచేశారు. ఇదిలావుంటే.. కరోనా ప్రభావంతో అనాథ శవంలా రాజవ్వ మృతదేహాన్ని తీసుకెళ్లడం చూసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
Published by:Narsimha Badhini
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.