హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం.. ఇక ఇంట్లోనే కరోనా..

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం.. ఇక ఇంట్లోనే కరోనా..

ఈటల రాజేందర్(ఫైల్ ఫోటో)

ఈటల రాజేందర్(ఫైల్ ఫోటో)

జీవనోపాధి కోల్పోవొద్దనే ఉద్దేశంతో మాత్రమే లాక్‌డౌన్‌ను ఎత్తేశామని చెప్పారు. అంతేతప్ప ప్రజలు అవసరం లేకున్నా బయటకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవొద్దని మంత్రి రాజేందర్ సూచించారు.

కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణ పట్ల ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేసినా కొంత మంది ప్రజల్లో భయాందోళనలు ఏమాత్రం తగ్గడం లేదు. హోంక్వారంటైన్లలో ఉండేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా.. ప్రజల్లో ఉన్న భయం వారిని ఆస్పత్రి నుంచి బయటకు రానివ్వడం లేదు. చిన్నఇల్లు ఉన్న వారు, ఇంట్లో ప్రత్యేక గది వసతి లేని వారు ఆస్పత్రిలోనే ఉండాలని కోరుకుంటున్నారు. మరోపక్క పాజిటివ్ పేషంట్ ఇంటి పక్కన ఉంటే తమకు వైరస్ సోకుతుందేమోనని భయం ప్రజల్లో ఉండడం వల్ల చాలామంది హోమ్ క్వారంటైన్‌లో ఉండేవారిని ఇబ్బంది పెడుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల జియాగూడలో ఓ వ్యక్తి కుటుంబంలో ముగ్గురికి కరోనా వైరస్ సోకడంతో ఇంటిలోనే ఉండేందుకు నిర్ణయించుకున్నారు. కానీ కాలనీలో పక్కన ఉండే వారు ఇబ్బంది పెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆస్పత్రికి రావాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల వల్ల హాస్పిటల్స్ మీద భారం పెరుగుతోంది.

రోజురోజూకీ హాస్పిటల్స్‌లో ఉండే వారి సంఖ్య పెరిగితే మరింత ఒత్తిడి పెరిగే అవకావం ఉంది. దీంతో తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్కువ లక్షణాలు ఉన్న, అసలు లక్షణాలు లేకుండా ఉన్న కరోనా పాజిటివ్ పేషంట్లను ఇంట్లో ఉంచి చికిత్స అందించేందుకు నిర్ణయించింది. ఇందుకు అందరూ సహకరించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. జీవనోపాధి కోల్పోవొద్దనే ఉద్దేశంతో మాత్రమే లాక్‌డౌన్‌ను ఎత్తేశామని చెప్పారు. అంతేతప్ప ప్రజలు అవసరం లేకున్నా బయటకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవొద్దని సూచించారు. లాక్‌డౌన్ సడలించడం వల్ల ప్రజలు ఎక్కువ మంది బయటకు రావడంతో వైరస్ వ్యాప్తి పెరిగిందన్నారు.

వయస్సు మీద పడిన వారికి , ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కరోనా వైరస్ సోకితే మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. అందువల్ల ప్రజలు కరోనా వైరస్ సోకకుండా ఉండేలా జాగ్రత్తలు పాటించాలని కోరారు. కరోనా మరణాలు తగ్గించేందుకు కృషి చేస్తున్నామని, భూమి మీద ఎక్కడ మందు ఉన్న తెచ్చి చికిత్స అందిస్తామని తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలోనే జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారిని గుర్తించి చికిత్స చేయాలని, జిల్లా కేంద్రంలోనే ఐసోలేషన్‌లో ఉంచే విధంగా ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు.

First published:

Tags: Coronavirus, Eetala rajender, Lockdown

ఉత్తమ కథలు