ఆ విషయంలో మంత్రి ఈటెలను మెచ్చుకుంటున్న నెటిజన్స్

ఈటల రాజేందర్(ఫైల్ ఫోటో)

గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజెేందర్ స్వయంగా కోవిడ్ వార్డుల్లోకి వెళ్లి రోగులతో నేరుగా మాట్లాడారు. వారికి అందిస్తున్న వైద్య చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

  • Share this:
    కరోనా కట్టడి విషయంలో తెలంగాణ సర్కారుపై మొదటి నుంచీ విమర్శలు వినిపిస్తున్నాయి. గాంధీ ఆస్పత్రితో పాటు జిల్లాల్లోని ప్రధాన ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులకు సరైన చికిత్స అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా కేసులు, మరణాలను ప్రభుత్వం దాస్తోందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై  మీడియా,  సోషల్ మీడియాలోనూ తెలగాణ ప్రభుత్వంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌‌కు నెటిజన్స్ నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇంతకీ కారణం ఏంటంటే...ఆదివారంనాడు ఆయన గచ్చిబౌలిలో కోవిడ్ రోగులకు చికిత్స కల్పిస్తున్న టిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ రోగులకు అందుతున్న వైద్యం, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ ఏకంగా కోవిడ్ రోగులు చికిత్సపొందుతున్న వార్డుల్లోనికి వెళ్లి రోగులు బాగోగులు  అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ తీవ్రత ఎక్కువై శ్వాస తీర్చుకునేందుకు కూడా ఇబ్బందిపడుతున్న రోగులు చికిత్సపొందుతున్న ఐసీయూ లోపలికి కూడా వెళ్లిన ఈటెల...అక్కడ వారికి అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

    కోవిడ్ అంటే సొంత కుటుంబ సభ్యులుగా రోగుల దగ్గరకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ చూపిన తెగువను నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. తద్వారా ఆరోగ్య మంత్రి డాక్టర్లు, వైద్య సిబ్బందిలో స్ఫూర్తిని నింపారని అభినందిస్తున్నారు.బహుశా దేశంలో ఏ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రీ ఈ రకంగా కోవిడ్ వార్డుల్లోకి వెళ్లి నేరుగా రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోలేదు. కోవిడ్‌ని కట్టడి చేయడంలో విఫలం చెందామన్న విమర్శలు వినిపిస్తున్న తరుణంలో...సోషల్ మీడియాలో అందుతున్న ప్రశంసలు ఆరోగ్య మంత్రి ఈటెలతో పాటు ప్రభుత్వానికి ఊరట లభిస్తోంది.
    Published by:Janardhan V
    First published: