Telangana: తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారా? క్లారిటీ ఇచ్చిన మంత్రి ఈటల రాజేందర్

ఈటల రాజేందర్ (ఫైల్)

ప్రస్తుతం భయానక పరిస్థితులు ఉన్నాయని.. స్వీయ నియంత్రణ తప్ప మరో మార్గం లేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని.. భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అవసరం అయితే తప్ప బయటకు రాకూడదని సూచించారు.

  • Share this:
    కరోనా సెకండ్ వేవ్ ప్రళయంలా విరుచుకుపడుతోంది. దేశమంతటా అల్లకల్లోలం నెలకొంది. జనాలు పెద్ద మొత్తంలో కరోనా బారినపడుతున్నారు. వేలాది మంది చనిపోతున్నారు. తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్ గానీ, నైట్ కర్ఫ్యూ గానీ విధిస్తారని ప్రచారం జరుగుతున్న వేళ..రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం భయానక పరిస్థితులు ఉన్నాయని.. స్వీయ నియంత్రణ తప్ప మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని.. భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అవసరం అయితే తప్ప బయటకు రాకూడదని సూచించారు. గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందన్నడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రజలెవరూ ఆందోళణ చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.

    తెలంగాణలో లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించే అవకాశం లేదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కేవలం స్వీయ నియంత్రణతోనే కరోనాను కట్టడి చేయగలమని చెప్పారు. మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోందని.. దాని ప్రభావం తెలంగాణపైనా ఉందని ఈటల రాజేందర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల మాదిరే తెలంగాణలోనూ వ్యాక్సిన్ కొరత ఉందని.. రాష్ట్రానికి సరిపడా కోవిడ్ డోసులను కేంద్రం పంపిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆక్సీజన్ ఉత్పత్తి కేంద్రం పరిధిలో ఉంటుందన్న ఈటల రాజేందర్.. ఇప్పటికిప్పుడు రాష్ట్రాలు ఆక్సీజన్‌ను ఉత్పత్తి చేసుకోలేవని స్పష్టం చేశారు. ఆక్సీజన్ కొరత లేకుండా చర్యలు చేపట్టామని.. పరిశ్రమలకు సరఫరా నిలిపివేసి, ఆరోగ్య రంగానికి కేటాయించాల్సిందిగా అధికారులను ఆదేశించామని తెలిపారు ఈటల.

    రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో బెడ్స్ కొరత లేదని ఆరోగ్యశాఖ మంత్రి అన్నారు. కేవలం ఐదారు ఆస్పత్రులు మాత్రమే నిండిపోయానని.. తెలంగాణలో 60వేల బెడ్స్ ఖాళీగా ఉన్నాయని ఈటల రాజేందర్ చెప్పారు. రెమెడిసివిర్ కొరత లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. తెలంగాణలో రోజుకు లక్షన్నర మందికి వ్యాక్సిన్ ఇస్తున్నామని.. 25 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ వేయాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. కాగా, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 5093 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 1555 మంది కోలుకోగా.. 15 మంది మరణించారు. తెలంగాణ ఇప్పటి వరకు 3,51,424 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో 3,12,563 కోలుకోగా.. ఇప్పటి వరకు 1,824 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 37,037 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published: