కరోనా టెస్ట్‌లను వ్యాపారంగా చూడొద్దు.. డయాగ్నస్టిక్స్‌తో మంత్రి ఈటల

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్

ఇంటికే వచ్చి పరీక్షలు చేస్తామంటూ మార్కెటింగ్ చేయొద్దని మంత్రి ఈటల చెప్పారు. విమానాల్లో వచ్చిన వారికి లక్షణాలు లేకపోయినా కరోనా పరీక్షలు చేయాలని సూచించారు.

  • Share this:
    ప్రైవేట్ ల్యాబ్స్‌లో కరోనా పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. డయాగ్నస్టిక్స్ ప్రతినిధులకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పలు కీలక సూచలు చేశారు. కరోనా పరీక్షలను వ్యాపార కోణంలో చూడొద్దని.. సాధారణ పరీక్షలకు, కరోనా టెస్టులకు చాలా తేడా ఉందని చెప్పారు. వీటిలో సర్వైలెన్స్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానాలు ఇమిడి ఉన్నాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రతి వ్యక్తి వివరాలను ప్రభుత్వ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు.

    అంతేకాదు ఇంటికే వచ్చి పరీక్షలు చేస్తామంటూ మార్కెటింగ్ చేయొద్దని మంత్రి ఈటల చెప్పారు. విమానాల్లో వచ్చిన వారికి లక్షణాలు లేకపోయినా కరోనా పరీక్షలు చేయాలని సూచించారు. అనుమానితులకు కరోనా పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నీషియన్లకు తప్పిసరిగా పీపీఈ కిట్లు ఇవ్వాలని.. లేదంటే కరోనా మరింత సంక్రమించే ప్రమాదముంటుందని చెప్పారు మంత్రి ఈటల. ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా కరోనా పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కాగా, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షల ధరను ప్రభుత్వం రూ.2200 గా ఖరారు చేసిన విషయం తెలిసిందే.

    మరోవైపు తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,674కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 4,005 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 217 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 4,452 యాక్టివ్ కేసులున్నాయి. సోమవారం 3,189 శాంపిల్స్‌ను పరీక్షించగా 2,317 మందికి నెగెటివ్ వచ్చింది. 872 మందికి పాజిటివ్ వచ్చింది. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు 60,243 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
    First published: