గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు అంతా వారం రోజుల పాటు హోం ఐసోలేషన్లో ఉండాలని తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ‘తెలంగాణలో ఇప్పటివరకు 55,51,620 పరీక్షలు చేశాం. 2,70,883 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రతి పది లక్షల మందిలో 1,49,156 మందికి పరీక్షలు నిర్వహించాం. పాజిటివ్ రేట్ 23 % నుంచి 1.1 % కి తగ్గింది.’ అని శ్రీనివాసరావు తెలిపారు. సెప్టెంబరులో లో 16,26,598 పరీక్షలు చేయగా 65,903 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 4.05% పాజిటివిటీ రేట్ నమోదు అయ్యింది. అక్టోబర్ నెలలో 12,73,823 పరీక్షలు చేయగా, 46,448 పాజిటివ్ కేసులు - 3.65% పాజిటివ్ రేట్ నమోదు అయ్యింది. నవంబర్ నెలలో - 11,76,392 పరీక్షలు చేయగా, 30,270 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి- 2.57% పాజిటివ్ రేట్ నమోదు అయ్యింది. డిసెంబర్ మొదటి రోజు 51,562 పరీక్షలు చేయగా 565 పాజిటివ్ కేసులతో 1.1% పాజిటివ్ రేట్ నమోదు అయ్యింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9266 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల రేషియో తెలంగాణ లో 3.4 % ఉండగా, దేశంలో 4.5% గా ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప ఆక్టివ్ కేసులు, అతి తక్కువ మరణాల రేటు, ఎక్కువ రికవరీ కేసులు నమోదు అయ్యాయి అని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ తెలియజేశారు. వైరస్ కి మనం మినహాయింపు కాదన్నారు. మన రాష్ట్రం లో కరోనా పూర్తిగా అదుపులో ఉందని, అయినా ఒక పక్క చలి తీవ్రత పెరిగింది మరో పక్క GHMC ఎన్నికలు జరిగాయి. GHMC ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. పెద్ద మొత్తంలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సమయంలో మనం జాగ్రత్తలు పాటించాలి. ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ వారం రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండండి. తెలియకుండా కరోనా సెకండ్ వేవ్ కి కారణం కాకండని ఆయన సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని పిలుపునిచ్చారు.. అనుమానం ఉన్నవారు, లక్షణాలు కనిపించిన వారు వెంటనే కరోనా పరీక్షలు చేయించు కోవాలని పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజలకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పిలుపునిచ్చారు.
కరోనా సెకండ్ వేవ్ రాకుండా అడ్డుకోవాలంటే మన చేతుల్లోనే ఉందని శ్రీనివాసరావు అన్నారు.. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, దయచేసి ప్రజలు కూడా భాద్యతగా వ్యవహరించాలని సూచించారు. పెళ్లిళ్లకు వందలాది మంది హాజరుకావడం వల్ల జగిత్యాలలో కేసుల సంఖ్య ఒక్క సారిగా పెరిగిందన్నారు. అలాంటి తప్పులు చేయవద్దని పిలుపునిచ్చారు. మాస్క్ ముక్కు, నోరు పూర్తిగా మూసుకొని ఉండే లా ధరించాలని సూచించారు. మాస్క్ నే మనకు 90% రక్షణ కల్పిస్తుందన్నారు. కరోనా ముప్పు ఇంకా పోలేదని ఆయన అన్నారు.