బ్రిటన్ను వణికిస్తున్న కొత్త రకం కరోనా వైరస్... అక్కడి నుంచి ప్రయాణికుల ద్వారా దేశంలోనూ ప్రవేశించిందనే వార్తలు చాలామందిని కలవరపెడుతున్నాయి. దీనిపై ఇప్పటికే సమీక్ష నిర్వహించిన కేంద్రం.. రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. తాజాగా తెలంగాణలోనూ కొత్త రకం వైరస్ వెలుగులోకి వచ్చిందనే ఊహాగానాలపై రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పందించారు. తెలంగాణలో కొత్త రకం కరోనా వైరస్ బారిన ఒక్కరు కూడా పడలేదని వివరించారు. నిన్న తెలంగాణకు బ్రిటన్ నుంచి ఏడుగురు మాత్రమే వచ్చారని తెలిపారు. ఈ నెల 15 -21 నుంచి 358 మంది ప్రయాణికులు యూకే నుంచి హైదరాబాద్ వచ్చారని అన్నారు.
వారం నుంచి హైదరాబాద్ లేదా తెలంగాణకు వచ్చిన వారు 040-24651119 నెంబర్‌కి ఫోన్ చేయాలని సూచించారు. కొత్త రకం కరోనా గురించి ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని శ్రీనివాసరావు తెలిపారు. కొత్త కరోనా వెరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు తెలుస్తోందని.. అయితే దీని కారణంగా మరణాలు తక్కువగానే ఉంటాయని సమాచారం అందుతోందని తెలిపారు. బ్రిటన్‌లో వెలుగులోకి వచ్చిన కొత్త రకం వైరస్‌కు సంబంధించి కేంద్రం నుంచి సూచనలు వచ్చాయని.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అప్రమత్త చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాబోయే 4 లేదా 5 వారాలలో వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతుందని తెలిపారు. తెలంగాణ లో కరోనా అదుపులో ఉందని.. రోజుకు 45 వేల నుంచి 50 వేల వరకు కరోనా టెస్టులు తెలంగాణ లో నిర్వహిస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలు వేడుకలకు దూరంగా ఉండాలని అన్నారు.
మరోవైపు కొత్త రకం వైరస్‌ను వచ్చినప్పుడు మ్యుటేషన్లు జరగడం సాధారణమే అని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్ రెడ్డి తెలిపారు.కొత్త వెరియెంట్ సోకిన వారు ఉంటే వారిని ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందిస్తామని అన్నారు. తెలంగాణ లో ఇప్పటి వరకు కొత్త కరోనా వెరియెంట్ సోకిన వారు లేరని వివరించారు. బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్లు హోం క్వారంటైన్లో ఉండటం మంచిదని సూచించారు. కొత్త వైరస్ సోకిన ఆందోళన అవసరం లేదని...ఇంతకు ముందు లాగే వారికి చికిత్స అందిస్తామని స్పష్టం చేశారు.
Published by:Kishore Akkaladevi
First published:December 22, 2020, 16:14 IST