కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ వచ్చిన నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం అయ్యింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానాన్ని అవలంభిస్తోంది. బ్రిటన్ నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని.. డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు 1200 మంది UK నుండి తెలంగాణకు వచ్చినట్లు గుర్తించామని అన్నారు. వారి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. వారందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీస్తున్నామని.. బ్రిటన్ నుంచి వచ్చిన వారికి పరీక్షలు చేసిన వారిలో ఇప్పటి వరకు ఎవరికీ కరోనా పాజిటివ్ రాలేదని తెలిపారు.
డిసెంబర్ 9 తరువాత బ్రిటన్ నుంచి రాష్ట్రానికి నేరుగా వచ్చిన వారు లేదా బ్రిటన్ గుండా ప్రయాణించి వచ్చిన వారు దయచేసి వారి వివరాలను 040-24651119 నంబర్ కి ఫోన్ చేసి లేదా 9154170960 నంబర్‌కి వాట్సప్ ద్వారా అందించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది. మరోవైపు తెలంగాణలో కరోనా వైరస్ రెండో స్టేజ్ వ్యాప్తి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రజలు ధైర్యంగా, అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా ఉపాధిని దూరం చేసి అల్లకల్లోలం సృష్టించిన కరోనా మన దేశంలో ఫస్ట్ ఫేజ్ కింద పీక్ స్టేజ్ కు వెళ్లిందని అన్నారు. బ్రిటన్ లాంటి దేశంలో సెకండ్ వేవ్ పేరిట కరోనా విజృంభిస్తున్నదని వార్తలు వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే భారత ప్రభుత్వం గానీ.. తెలంగాణ ప్రభుత్వం గానీ విమానాశ్రయాలలో అలర్ట్ చేసినట్టు చెప్పారు. యూకే నుంచి వచ్చే వాళ్ళకి విమానాశ్రయాల్లోనే టెస్టులు చేసి.. ఐసోలేషన్ కి పంపడం.. పాసిటివ్ వస్తే ట్రీట్మెంట్ కి పంపుతున్నాయమని వివరించారు.
చలికాలం ఇంకో నెల ఉంది కాబట్టి... ఈ నెల రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మనకూ సెకండ్ వేవ్ వస్తుందని అనుకోనప్పటికీ.. శీతాకాలం కావున కొంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఏ పరిస్థితి వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సర్వ సన్నద్ధంగా ఉందని తెలిపారు. తనవరకైతే.. సెకండ్ వేవ్ రాకూడదని ఎలా తగ్గిపోయిందో అలాగే ఉండాలని కోరుకుంటున్నానని రాజేందర్ అన్నారు. ప్రజలందరూ దైర్యంగా, అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మరోవైపు కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ రాష్ట్రం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ చర్యలు, ప్రజల సహకారం వల్ల వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్యను అదుపులో ఉంచగలిగామని తెలిపింది. మున్ముందు కూడా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. కొత్త రకం వైరస్ తో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ... అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. మాస్క్ తప్పని సరిగా వాడాలని.. భౌతిక దూరం పాటించాలని కోరింది. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించింది.
Published by:Kishore Akkaladevi
First published:December 23, 2020, 21:21 IST