తెలంగాణకు కరోనా సెకండ్ వేవ్ ముప్పు.. అధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

ప్రజలంతా తప్పకుండా మాస్క్ ధరించాలని.. తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు సీఎం కేసీఆర్. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ముందు ఆరోగ్య సిబ్బందికే ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

news18-telugu
Updated: November 22, 2020, 3:50 PM IST
తెలంగాణకు కరోనా సెకండ్ వేవ్ ముప్పు.. అధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
తెలంగాణ సీఎం కేసీఆర్
  • Share this:
తెలంగాణలో కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చే అవకాశముందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండి, అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కేసులు మళ్లీ పెరగకుండా, సెకండ్ వేవ్ వచ్చినా తట్టుకునే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని వెల్లడించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, తగిన వ్యక్తిగత భద్రత పాటించడమే అసలైన మందు అని సిఎం సూచించారు. కోవిడ్ పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. ‘‘రాష్ట్రంలో మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. తెలంగాణ కోవిడ్ కేసుల సంఖ్య బాగా తగ్గింది. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పదిశాతం లోపే ఉంటుంది. రికవరీ రేటు 94.5 శాతం ఉంటున్నది. కోవిడ్ వచ్చిన వారు కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ, మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. రాష్ట్ర వ్యాప్తంగా పదివేల బెడ్స్ ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయి. ఇంకా ఎన్నయినా సిద్ధం చేయగలం. ప్రస్తుతం మాత్రం పరిస్థితి అదుపులోనే ఉంది’’ అని స్పష్టం చేశారు.

‘‘ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కేసులు బాగా పెరుగుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా కొద్దిగా పెరుగుతున్నాయి. దీంతో పాటు కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. సెకండ్ వేవ్ వచ్చినా సరే తట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉండాలి. దానికి తగిన ఏర్పాట్లు చేయాలి’’ అని సిఎం అధికారులను ఆదేశించారు.

కోవిడ్ వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం చేయాల్సినంత ప్రయత్నం చేస్తోందన్న ఆయన.. దీనికి ప్రజల సహకారం కూడా అవసరంమని చెప్పారు. అన్ లాక్ ప్రక్రియ నడుస్తున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండడమే అసలైన మందు అని స్పష్టం చేశారు. ప్రజలంతా తప్పకుండా మాస్క్ ధరించాలని.. తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు సీఎం కేసీఆర్. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ముందు ఆరోగ్య సిబ్బందికే ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముర్తజా రిజ్వీ, సిఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, మెడికల్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్ రెడ్డి, కోవిడ్ నిపుణుల కమిటీ సభ్యుడు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Published by: Shiva Kumar Addula
First published: November 22, 2020, 3:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading