హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. అధికారులకు సీఎం కేసీఆర్ కీలక సూచన

వైరస్ నిర్ధారిత పరీక్షలతో పాటు చికిత్స విధానం, తీసుకుంటున్న జాగ్రత్తలపై పూర్తి వాస్తవాలను హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. విచారణ సందర్భంగా కోర్టుకు కావాల్సిన ఖచ్చితమైన సమాచారాన్ని వైద్యాధికారులు అందించాలని సూచించారు.

news18-telugu
Updated: July 21, 2020, 7:14 PM IST
హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. అధికారులకు సీఎం కేసీఆర్ కీలక సూచన
సీఎం కేసీఆర్
  • Share this:
తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కరోనా పరీక్షల తీరు, చికిత్సా విధానంపై పూర్తి వివరాలను హైకోర్టుకు సమర్పించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో కరోనాపై సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. సమీక్ష సందర్భంగా హైకోర్టులో కరోనా విషయంలో దాఖలవుతున్న పిల్స్, వాటిపై విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకోవడంలోనూ, పరీక్షలు-చికిత్స విషయంలోనూ ప్రభుత్వం, వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ.. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావడం పట్ల సమావేశంలో పాల్గొన్న పలువురు తమ అభిప్రాయాలు వెల్లడించారు.

‘‘కరోనా విషయంలో ఎవరు పడితే వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. హైకోర్టు ఇప్పటికి 87 పిల్స్ ను స్వీకరించింది. నిత్యం కోర్టు విచారణ వల్ల అధికారులకు ఇబ్బంది కలుగుతోంది. వైద్యాధికారులు, ఇతర సీనియర్ అధికారులు కోర్టు చుట్టూ తిరగడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. ఈ క్లిష్ట సమయంలో చేయాల్సిన పని వదిలి పెట్టి కోర్టుకు తిరగడం, విచారణకు సిద్ధమవడంతోనే సరిపోతోంది. దీనివల్ల విధులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నాం.'' అని పలువురు అధికారులు సీఎం కేసీఆర్ వద్ద వాపోయారు.

వాస్తవానికి దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గానే ఉందని.. మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉందని సీఎంకు అధికారులు వివరించారు. ఎంత మందికైనా సరే వైద్యం అందించడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రతీ రోజు వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నామని.. ఇంత చేసినప్పటికీ హైకోర్టు వ్యాఖ్యలు బాధిస్తున్నాయని వాపోయారు. గతంలో కూడా మృతదేహాలకు పరీక్షలు నిర్వహించాలని ఎవరో పిల్స్ దాఖలు చేశారని.. దానికి అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వాస్తవ పరిస్థితిని పరిగణలోనికి తీసుకుని ఆ తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసిందని చెప్పారు. అయినప్పటికీ హైకోర్టులో పిల్స్ దాఖలు అవుతూనే ఉన్నాయని తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు కూడా హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కరోనా విషయంలో ప్రభుత్వం ఏమీ చేయడం లేదనే అభిప్రాయం కలిగించేలా వార్తలు రాస్తున్నాయని.. ఇది ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పనిచేస్తున్న వైద్య సిబ్బంది స్థైర్యం దెబ్బతీస్తోందని సీఎంతో చెప్పారు అధికారులు.

సమావేశంలో వ్యక్తమయిన అభిప్రాయాలను సీఎం కేసీఆర్ ఓపిగ్గా విన్నారు. వైరస్ నిర్ధారిత పరీక్షలతో పాటు చికిత్స విధానం, తీసుకుంటున్న జాగ్రత్తలపై పూర్తి వాస్తవాలను హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. విచారణ సందర్భంగా కోర్టుకు కావాల్సిన ఖచ్చితమైన సమాచారాన్ని వైద్యాధికారులు అందించాలని సూచించారు. హైకోర్టు అడిగిన ప్రతీ వివరాన్నీ, చేస్తున్న పనిని తెలపాలని చెప్పారు సీఎం కేసీఆర్. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ ముర్తజా రిజ్వి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, వివిధ వైద్య విభాగాధిపతులు శ్రీనివాస్, రమేశ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
Published by: Shiva Kumar Addula
First published: July 21, 2020, 7:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading