హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

కరోనా సోకినా మా ఖర్మకు వదిలేశారు... గల్ఫ్‌లో తెలంగాణ కార్మికుల గోస...

కరోనా సోకినా మా ఖర్మకు వదిలేశారు... గల్ఫ్‌లో తెలంగాణ కార్మికుల గోస...

దుబాయ్‌లో కరోనా బారిన పడిన తెలంగాణ వారు

దుబాయ్‌లో కరోనా బారిన పడిన తెలంగాణ వారు

కేరళలోని మలబార్ కు చెందిన వారితో పాటు తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు చెందిన 10 మందికి కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సమాచారం.

  దేశం కాని దేశంలో ఉపాధి కోసం వలస వెళ్లిన వారిని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. గల్ఫ్ దేశాలలో తెలంగాణ‌వాసులకు కొదవలేదు. ముఖ్యంగా కార్మికులుగా చాలామంది గల్ఫ్ దేశాలలో ఉన్నారు. కొవిడ్-19 ఎక్కువ ఉన్న దేశాలలో గల్ఫ్ దేశాలు ఉన్నాయి. గల్ఫ్ దేశమైన దుబాయిలో అంజుమాన్ క్యాంపులో ఉన్న తెలంగాణ వారికి కరోనా సోకినట్లు తెలిసింది. బెల్ హసా కంపెనీలో వలస కార్మికులుగా తెలంగాణ, కేరళ, పాకిస్తాన్‌కు చెందినవారు పని చేస్తున్నారు.

  తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాకు చెందినవారు 80 మంది అక్కడ పని చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో కేరళలోని మలబార్ కు చెందిన వారితో పాటు తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు చెందిన 10 మందికి కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సమాచారం. వారిని అంజుమాన్ ప్రాంతంలోని కార్మికుల క్యాంప్‌లో రెండు గదులకు (హోం క్వారంటైన్) పరిమితి చేసింది యజమాన్యం. వారికి పాజిటివ్ అని నిర్ధారణ అయిన తరువాత వారిని ఇతర కార్మికులు ఉపయోగించే కిచెన్, బాత్రూమ్‌లను వాడుకునేలా చేసింది. అయితే, మిగిలినవారికి కరోనా పరీక్షలు నిర్వహించలేదని వారు వాట్స‌ప్‌ ద్వారా స‌మాచారాన్ని పంపారు.

  దుబాయ్‌లో చిక్కుకున్న ఓ బాధితుడు

  పనులు చేస్తేనే పరీక్షలు నిర్వహిస్తామని కంపెనీ పేచీ పెట్టిందని బాధితులు వీడియోలో వాపోతున్నారు. క్యాంప్‌లో ఇరుకు గదుల్లో ఉన్న మిగిలినవారి పరిస్థితి దారుణంగా ఉందని, కేంద్ర, రాష్ట్ర‌ ప్రభుత్వాలు జోక్యం చేసుకుని విదేశాంగ శాఖ ద్వారా తమను అదుకోవాలని కోరుతూ బాధితులు అక్కడ నెలకొన్న పరిస్థితిని వీడియో తీసి పంపించారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

  గల్ఫ్ దేశంలో పలువురు తెలంగాణవాసులు క‌రోనా వైర‌స్ బాధితులు ఓ వీడియోను రూపొందించి దానిని తెలంగాణ గల్ఫ్ వెల్పేర్ సొసైటీ అధ్యక్షులు పాట్కూరి బసంత్‌రెడ్డికి పంపించారు. తనకు చేరిన సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు వైద్యంతో పాటు మిగిలిన వారికి పరీక్షలను నిర్వహించేందుకు బసంత్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్న‌ట్లు తెలిపారు.

  (మహేందర్, నిజామాబాద్ ప్రతినిధి, న్యూస్‌18)

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Coronavirus, Dubai, Telangana

  ఉత్తమ కథలు