KCR Corona Positive: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్..

KCR Corona Positive: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్..

సీఎం కేసీఆర్(ఫైల్ పొటో)

KCR corona positive: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా రావడంతో ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై ఎప్పటిప్పుడు మానిటర్ చేస్తున్నారు.

  • Share this:
    తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ‘తెలంగాణ  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయనకు స్వల్పంగా లక్షణాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ఫాం హౌస్ లో ఐసోలేషన్‌లో ఉన్నారు. డాక్టర్ల బృందం ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.’ అంటూ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ పేరుతో ప్రకటన విడుదల అయింది. తెలంగాణలో ఇటీవల కరోనా బీభత్సం సృష్టిస్తోంది. ఇటీవల కాలంలో వరుసగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అక్కడ భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు కరోనా నిబంధనలను గాలికి వదిలేశాయనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.

    ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జలుబుగా ఉంది. కరోనా టెస్టులు చేస్తే రిపోర్టు పాజిటివ్ వచ్చింది. ఆయన బీపీ, షుగర్, పల్స్ రేట్ అంతా బాగానే ఉంది. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. మామూలు డైట్ తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం పూర్తి నిలకడగా ఉంది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆందోళన చెందాల్సిన పనిలేదు ’  అని సీనియర్ ఫిజీషియన్, సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవీ రావు చెప్పారు.


    తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన కరోనా బులెటిన ప్రకారం రాష్ట్రంలో 24 గంటల్లో 4009 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 39,154 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పెరుగుతుండడంతో తెలంగాణలో లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ విధిస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే, దీనిపై ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందిస్తూ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే అవకాశం లేదని స్పష్టం చేశారు. అయితే, ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గాలి ద్వారా కరోనా వ్యాప్తి జరుగుతోందంటూ ప్రచారం కావడంతో ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. కానీ, కరోనా జాగ్రత్తలు మాత్రం పాటించాలని స్పష్టం చేశారు.



    తెలంగాణలో కరోనా పెరుగుతున్నా కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తం అయింది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీకెండ్ కర్ఫ్యూ, లాక్ డౌన్ అంశంపై 48 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే కోర్టు జోక్యం చేసుకుని ఆదేశాలు ఇస్తుందని స్పష్టం చేసింది. ఈ వాదనలపై స్పందించిన ప్రభుత్వం తరఫు న్యాయవాది తాము మూడు రోజుల్లో ఏమీ చేయలేమని చేతులెత్తేశారు.

    లాక్ డౌన్ ఉండదని ప్రభుత్వం చెప్పడం, కర్ఫ్యూా లాంటివి కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద తిరుగుతున్నారు.  వారిలో కొందరు కనీసం మాస్క్‌లు కూడా ధరించడం లేదు. మాస్కులు ధరించాలంటూ ప్రభుత్వం, ఫ్రంట్ లైన్ వారియర్లు ఎంత చెప్పినా కూడా కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈక్రమంలో ప్రభుత్వం అలాంటి వారిపై చర్యలు తీసుకోవడంలో భాగంగా మాస్కులు పెట్టుకోని వారికి రూ.1000 జరిమానా విధించాలని నిర్ణయించింది. అయినా కూడా కొందరిలో మార్పు రాకపోవడం గమనార్హం.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు