Telangana: తెలంగాణలో లాక్‌డౌన్‌‌‌పై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

సీఎం కేసీఆర్

గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 518 మంది కరోనా బారినపడ్డారు. మరో 204 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. కరోనాతో మరో ముగ్గురు మరణించారు. తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,309కి చేరింది.

  • Share this:
    దేశంతో పాటు తెలంగాణలోనూ కరోనా విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలను మూసివేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రజల్లో మళ్లీ టెన్షన్ నెలకొంది. మళ్లీ లాక్‌డౌన్ పెడతారా? అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ పెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టంచేశారు. కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాస్క్‌లు ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలని చెప్పారు తెలంగాణ సీఎం.

    ''కరోనా కట్టడిలో తెలంగాణ ముందు వరుసలో ఉంది. కేంద్రమే ఈ విషయమే చెప్పింది. సెకండ్ వేవ్ తర్వాత టెస్ట్‌లు పెంచుతున్నాం. బాధతోనే స్కూళ్లు, హాస్టళ్లు మూసివేశాం. పిల్లలకు కరోనా వ్యాప్తి చెందుతోంది. విస్ఫోటనంలా మారక ముందే చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. ఇటీవల కొందరు సినిమాలు మా వద్దకు వచ్చారు. మళ్లీ లాక్‌డౌన్ పెడతారా? అని అడిగారు. మళ్లీ లాక్‌డౌన్ పెడితే తీవ్రంగా నష్టపోతామని చెప్పారు. ఇది విచిత్ర పరిస్థితి. మన దేశంతో పాటు ఎన్నో దేశాలు నష్టపోయాయి. ఏడాది కాలంగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వేధిస్తోంది. జీడీపీ బాగా దెబ్బతింది. కానీ ఆర్థికంగా బాగానే ఉన్నాం. అందరూ మైనస్‌లో ఉంటే తెలంగాణ 1.7గా ఉంది. ప్రధాని మోదీ కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. కరోనా కట్టడిపై మేమూ సూచనలు చేస్తున్నాం. వ్యాక్సిన్ విషయంలో అన్ని చర్యలు తీసుకుంటున్నాం. స్కూళ్లను తాత్కాలికంగానే మూసివేశాం. తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదు. పరిశ్రమలను మూసివేయబోం. ఇప్పటికే ఎంతో నష్టపోయాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలి. శానిటైజర్లు వాడాలి. తక్కువ మందితో ఫంక్షన్‌లు చేసుకోవాలి. పెద్ద పెద్ద ఊరేగింపులు చేయకూడదు. స్వీయ నియంత్రణతోనే కరోనాను ఎదుర్కొనగలుగుతాం.'' అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

    కాగా, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 518 మంది కరోనా బారినపడ్డారు. మరో 204 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. కరోనాతో మరో ముగ్గురు మరణించారు. తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,309కి చేరింది. ఇప్పటి వరకు 2,99,631 మంది కోలుకోగా.. 204 మంది మరణించారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 3,995 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 1,767 మంది ఇళ్లల్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. మన దేశంలో కరోనా మరణాల రేటు 1.4శాతం ఉండగా తెలంగాణలో 0.55శాతంగా ఉంది. దేశంలో రికవరీ రేటు 95.1గా ఉంటే తెలంగాణలో 98.14శాతంగా ఉంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 57,548 మందికి పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 99,03,125 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రతి పది లక్షల మందిలో 2,66,069మంది కోవిడ్ పరీక్షలు చేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published: