Telangana Corona: కరోనా చావులకు కేసీఆరే కారణం: భట్టి విక్రమార్క

మల్లు భట్టి విక్రమార్క, (File)

కరోనాపై కాంగ్రెస్ హెచ్చరించినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదని, పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని ప్రగల్బాలు పలికిన సీఎం కేసీఆర్ కరోనాను కట్టడి చేయలేక ఇప్పుడు ఫాంహౌస్ కే పరిమితం అయ్యారని భట్టి మండిపడ్డారు.

  • Share this:
    కరోనాను కట్టడి చేయడంలో సీఎం కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆరోపించారు. కేసీఆర్ చేతగాని తనం కారణంగా తెలంగాణ రాష్ట్రాన్ని కోవిడ్ మహమ్మారి పట్టిపీడిస్తోందన్నారు. రాబోయే ప్రమాదాన్ని మూడు నెలల ముందుగానే కాంగ్రెస్ హెచ్చరించినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదని విమర్శించారు. పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని ప్రగల్బాలు పలికిన ఆయన కరోనాను కట్టడి చేయలేక ఇప్పుడు ఫాంహౌస్ కే పరిమితం అయ్యారని మండిపడ్డారు. సీఎల్పీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రభుత్వ ఆసుపత్రుల సందర్శనలో భాగంగా ఆయన హుజూరాబాద్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కరోనా వ్యాధి వేగంగా వ్యాప్తి చెందడంతో పేద ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత మంది మరణాలకు సీఎం కేసీఆరే కారణమన్నారు భట్టి. సాక్షాత్తు వైద్యారోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గం హుజూరాబాద్ ప్రభుత్వాస్పత్రి కూడా మరీ ఇంత అధ్వానంగా ఉంటుందని అనుకోలేదని.. ఆస్పత్రి సందర్శనతో నిజాలు బయట పడ్డాయన్నారు. జమ్మికుంట సర్కార్ దవాఖానాలో అడుగు అడుగునా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి చిత్రహింసలకు గురి చేస్తున్నారని.. ప్రవీణ్ యాదవ్ అనే ఉద్యోగి మరణానికి సర్కారే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ప్రతి పేదవాడికి ఉచితంగా కరోనా ట్రీట్మెంట్ చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
    హుజూరాబాద్‌లో ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన భట్టి, కాంగ్రెస్ నేతలు

    తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,795 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. వీటితో కలిపితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,14,483కి చేరింది. తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య సంఖ్య తక్కువగానే ఉంది. కొత్తగా 8 మరణాలు నమోదు కాగా, రాష్ట్రంలో మొత్తం కరోనా సంఖ్య 872కి చేరింది. జాతీయ మరణాల రేటు (1.84శాతం) కంటే తెలంగాణ మరణాల రేటు (0.68) తక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో 872 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 86,095కి చేరింది. తెలంగాణలో కరోనా పేషెంట్ల రికవరీ రేటు 75.2గా ఉంది. భారతదేశ రికవరీ రేటు 76.28గా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 27,600గా ఉంది. 20,866 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. నిన్న కొత్తగా 60,386 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 11,42,480కు చేరింది.మరో 1,075 మంది కరోనా పరీక్షల రిపోర్టులు రావాల్సి ఉంది. తెలంగాణలో ప్రతి పది లక్షల మందిలో 30,772 మంది కరోనా పరీక్షలు చేస్తున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: