ప్యాకేజీతో వెలుగులు నింపిన మోదీకి... తెలంగాణ బీజేపీ నమో జ్యోతి...

నమో జ్యోతి కార్యక్రమంలో టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

రూ.లక్షా 70వేల కోట్ల ప్యాకేజీతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారంటూ తమ కుటుంబసభ్యులతో కలిసి బీజేపీ కార్యకర్తలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

 • Share this:
  బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నమో జ్యోతి కార్యక్రమం నిర్వహించారు. మనల్ని, మన దేశాన్ని, ప్రపంచాన్ని కరోనా నుంచి విముక్తి చేయాలని అన్ని జిల్లాల్లో కార్యకర్తలు తమ ఇంటి ముంగిట జ్యోతి వెలిగించి దేవుణ్ణి ప్రార్ధించారు. రూ.లక్షా 70వేల కోట్ల ప్యాకేజీ ద్వారా 99 శాతం మంది పేద, మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారంటూ తమ కుటుంబసభ్యులతో కలిసి కార్యకర్తలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నమో జ్యోతి కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు తమ సమీపంలో ఉన్న పేద ప్రజలకు తమ ఇళ్ల వద్ద భోజన ఏర్పాట్లు చేశారు. మరికొంత మంది కార్యకర్తలు పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

  నమో జ్యోతి కార్యక్రమంలో టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్


  నమో జ్యోతి కార్యక్రమం అనంతరం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కరోనా పై పోరాటంలో కార్యకర్తలు మోదీకి అండగా నిలవాలన్నారు. ప్రపంచ యుద్ధ సమయంలో కూడా ప్రజలను ఈ విధంగా ఏ నాయకుడు ఆదుకోలేదన్నారు. ఇలాంటి విపత్తు సమయంలో మోదీ మన దేశ ప్రధానిగా ఉండడం ఈ దేశ ప్రజల అదృష్టం అని కొనియాడారు. కరోనాపై యుద్ధంలో మోదీ దేశానికి కొండంత అండ అని అన్నారు.

  మోదీ ప్రకటించిన ప్యాకేజి వలన రాష్ట్రంలో 59లక్షల మంది జాబ్ కార్డులన్న ఉపాధి హామీ కూలీలకు, ఉజ్వల గ్యాస్ పొందిన 9.36 లక్షల కుటుంబాలకు, 45 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళల కు, 5.5లక్షల మంది ప్రైవేట్ ఉద్యోగస్తులకు, 50లక్షల మందిరైతులకు లబ్ది చేకూరుతుందని చెప్పారు. ఇది పేద ప్రజలకు ఒక గొప్ప భరోసా ఇస్తుందన్నారు. ఇవి సరిగా లబ్ధిదారులకు అందేలా కార్యకర్తలు చొరవ తీసుకోవాలన్నారు. ఈ ఆపద సమయంలో ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. బీజేపీ అంటేనే సేవ అనే రీతిలో సేవా కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. ప్రజలు కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒకరికి ఒకరు అండగా నిలవాలన్నారు.

  కరోనా పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి కాబట్టి నిర్లక్ష్యం కూడా పనికి రాదని అన్నారు. ప్రభుత్వం అందించే సూచనలు తప్పకుండా పాటించడం మన బాధ్యతగా ప్రతి ఒక్కరు గుర్తించాలి అని కోరారు. ప్రతి ఒక్కరూ ఇంటికి పరిమితం కావాలని కోరారు. సామాజిక దూరం, స్వీయ నియంత్రణ ద్వారానే కరోనాను ఎదుర్కోగలుగుతామని అన్నారు. ఈ విపత్తును ఎదుర్కోవడంలో ప్రభుత్వానికి, అధికారులకు ఎలాంటి సహకారం కావాలన్నా అందించటానికి తమ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని పునరుద్ఘాటించారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: