తెలంగాణలో కరోనా పరిస్థితిపై వాస్తవాలు తెలుసుకోవడానికి వచ్చిన కేంద్రం బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించిందని తాము బలంగా నమ్ముతున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. కరోనా యొక్క ప్రభావాన్ని తక్కువగా చూపించాలనే లక్ష్యంతో రాష్ట్ర యంత్రాంగాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరీక్షలు చేయడం లేదని... అలాగే వ్యాధి కారక మూలాలు తెలుసుకునే ప్రయత్నాలు చెయ్యలేదని అన్నారు. పూర్తి స్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మార్చబడిన గాంధీ ఆసుపత్రిలోని సౌకర్యాల గురించి మాకు వివిధ వర్గాల నుండి చాలా ఫిర్యాదులు వచ్చాయని అన్నారు.
సీఎస్ శాస్త్రి అనే ఎనభై ఏళ్ల వ్యక్తి కరోనా అనుమానంతో ఏప్రిల్ 12 న గాంధీ ఆసుపత్రికి వెళ్లారని... ఆయనకు పరీక్ష తర్వాత నెగెటివ్‌గా ప్రకటించారని బండి సంజయ్ పేర్కొన్నారు. నాలుగు రోజుల తరువాత అదే వ్యక్తిని మరొక ఆసుపత్రిలో (నిమ్స్) పరీక్షించినప్పుడు పాజిటివ్‌గా ప్రకటించారని.. ఆయన ఏప్రిల్ 26న తుది శ్వాస విడిచారని అన్నారు. అయితే ఏప్రిల్ 26, 27 మరియు 28 నివేదికలలో ప్రభుత్వం అతని మరణాన్ని చూపించలేదని ఆరోపించారు. ఆయన 26వ తేదీన కరోనాతో మరణించాడని మరణ నివేదిక స్పష్టంగా చూపిస్తుందని... ఈ ఉదంతం, ప్రభుత్వ ఉద్దేశాన్ని అనుమానించడానికి అవకాశం ఇస్తుందని అన్నారు.
ఈ సమస్యలన్నీ వారి దృష్టికి తెచ్చేందుకు తెలంగాణ బీజేపీ శాఖ వారి నుంచి సమయం కోరిందని అన్నారు. అయితే అదే రోజు ప్రాంతీయ వార్తాపత్రికలలో కేంద్ర బృందం ఇక్కడి సౌకర్యాలతో సంతృప్తి చెందిందని నివేదికలు రావడం, మాకు తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నారు. దీర్ఘకాలంలో అదృశ్య శత్రువుపై జరిగే మన యుద్ధంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని... అందువల్ల తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి, కోవిడ్ వ్యాధి చికిత్స తీరులను, వైధ్య సదుపాయాలను, సమీక్షించడానికి మరొక కేంద్ర బృందాన్ని పంపించాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Coronavirus, Telangana, Union Home Ministry