దేశంలో మరోసారి కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. 12 మంది బాలికలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వివరాలు.. సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంఘం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదువుతున్న ముగ్గురు విద్యార్థినిలలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో మిగతవారికీ కూడా కరోనా సోకిందనే ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే స్కూల్‌లోని బాలికలకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించారు. మొత్తం 150 మందికి ర్యాపిడ్ టెస్ట్‌లు చేయించగా అందులో 132 మంది విద్యార్థులు, 18 మంది సిబ్బంది ఉన్నారు. అయితే అందులో 12 మంది బాలికలకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. వారిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచారు.
మరోవైపు ర్యాపిడ్ టెస్ట్‌ల్లో నెగిటివ్ వచ్చినవారికి ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం శాంపిల్స్ కలెక్ట్ చేశారు. ఇంకా ఆ రిపోర్ట్‌లు రావాల్సి ఉంది. స్కూల్‌లో 12 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో.. నెగిటివ్ వచ్చిన విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్నారు.
ఇక, తెలంగాణలో శుక్రవారం 40,821 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 178 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,98,631కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. ఇక, శుక్రవారం కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,633కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 148 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,95,059కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,939 ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.