ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ధరలపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఛత్తీస్గఢ్ రూ.337కి కిట్ కొంటే.. ఏపీ ప్రభుత్వం రూ.730కి కొనుగోలు చేసింది. ఇంత ఎక్కువ ధరకు కొనడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష టీడీపీ అయితే వైసీపీ సర్కారుపై దుమ్మెత్తి పోసింది. టీడీపీ విమర్శలను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. అయితే, ఆయనే పప్పులో కాలేశారు. వివరాల్లోకెళితే.. టీడీపీ రాద్ధాంతంపై ఆయన ట్విట్టర్ వేదికగా ఆ పార్టీపై విరుచుకుపడ్డారు. ‘శవాల మీద పేలాలు ఏరుకునే పచ్చ మాఫియా ర్యాపిడ్ టెస్ట్ కిట్లపైన ఏడుపు మొదలు పెట్టింది. ఛత్తీస్ గడ్ రూ. 337 కు కొంటే మీరు 700 దాకా ఎలా పెడతారని. అవి దేశంలోనే తయరైనవి. రిజల్ట్ కు 30 ని. పడుతుంది. సిఎం జగన్ గారు కొరియా నుంచి తెప్పించినవి 10 ని.ల్లోనే కచ్చితమైన ఫలితాలు చూపుతాయి.’ అని పేర్కొన్నారు. అయితే, ఛత్తీస్గఢ్ కొన్న ర్యాపిడ్ కిట్లు కూడా దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్నవే అని తేలిపోయింది.
శవాల మీద పేలాలు ఏరుకునే పచ్చ మాఫియా ర్యాపిడ్ టెస్ట్ కిట్లపైన ఏడుపు మొదలు పెట్టింది. ఛత్తీస్ గడ్ రూ. 337 కు కొంటే మీరు 700 దాకా ఎలా పెడతారని. అవి దేశంలోనే తయరైనవి. రిజల్ట్ కు 30 ని. పడుతుంది. సిఎం జగన్ గారు కొరియా నుంచి తెప్పించినవి 10 ని.ల్లోనే కచ్చితమైన ఫలితాలు చూపుతాయి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 19, 2020
దీనిపై ఛత్తీస్గఢ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. ఛత్తీస్గఢ్లో 75,000 హై క్వాలిటీ కిట్ల కొనుగోలు కోసం ఒక్కో దానికి రూ.337 ప్లస్ జీఎస్టీ చెల్లించినట్టు తెలిపారు. భారత్లో ఉన్న ఓ దక్షిణ కొరియా సంస్థ నుంచి తాము ఈ కిట్లు కొనుగోలు చేసినట్టు చెప్పారు. భారత్లో ఇదే అత్యంత తక్కువ ధర అని కూడా తెలిపారు. భారత్లో ఉన్న దక్షిణ కొరియా అంబాసిడర్, దక్షిణ కొరియాలో ఉన్న భారత్ అంబాసిడర్తో నిరంతరం మాట్లాడి తక్కువ ధరకు కొనుగోలుచేసినట్టు చెప్పారు.
We are procuring 75,000 high quality rapid testing kits at a benchmark price of ₹337 + GST from a South Korean company based in India, which has proven to be the lowest bidder. The rate we have been able to close at is the lowest in India. (1/2)
— TS Singh Deo (@TS_SinghDeo) April 17, 2020
దీన్ని బట్టి విజయసాయిరెడ్డి చెప్పిందంతా అబద్ధమేనని.. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ర్యాపిడ్ టెస్ట్ కిట్లను దేశంలో కొనలేదని.. దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్నవేనని తేలిపోయిందని టీడీపీ నేతలు అంటున్నారు. విజయసాయి రెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. అదీకాక.. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చెల్లించిన ప్రకారమే తాము కూడా చెల్లిస్తామని ఏపీ ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో టీడీపీ నేతలు మరింత జోరందుకున్నారు. అయితే, ట్విట్టర్లో చెప్పిందంతా అబద్ధమేనా? అంటూ ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Corona virus, Coronavirus, Covid-19, Tdp, Vijayasai reddy, Ycp