మానవాళి మనుగడకే ముప్పుగా మారిని కరోనా వైరస్ పై ప్రపంచమంతా పోరాడుతోంది. సామాన్యుల నుంచి ప్రముఖల వరకు అనేక మంది ఈ వైరస్ బారిన పడ్డారు. అయితే ఈ వైరస్ కు చెక్ పెట్టేందుకు త్వరలో వ్యాక్సిన్ వస్తుందన్న ఆశతో ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సమయంలో వచ్చిన మరో వార్త ఆందోళన కలిగిస్తోంది. కరోనాలో మరో రకం వైరస్ విజృంభించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతుండడం ఇందుకు కారణమైంది. గబ్బిలాల నుంచి పందులకు పాకిన ఈ వైరస్.. వాటి నుంచి మనుషులకూ అంటుకునే ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ నార్త్‌కరోలినా సైంటిస్టుల స్టడీలో ఈ వైరస్ ను గుర్తించారు. ఆ వైరస్ ను స్వైన్ అక్యూట్ డయేరియా సిండ్రోమ్ కరోనా వైరస్(SADS-CoV) అని పిలుస్తున్నారు.
2017లోనే గుర్తింపు..
ఈ SADS-CoV వైరస్ ను 2017లోనే గుర్తించారు. అయితే ఇది ఇప్పటివరకు మనుషులకు సోకలేదు. ఒకవేళ ఇది సోకితే మాత్రం దాని ముప్పు భారీగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చైనాలో గబ్బిలాల్లోని హెచ్‌కేయూ2 కరోనా వైరస్ల నుంచి ఈ సాడ్స్కొవీ పుట్టింది. వాటి నుంచి పందులకు సోకిందని సైంటిస్టులు తేల్చారు.
డయేరియా, వాంతులు వచ్చే ప్రమాదం..
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బీటా కేటగిరీలోని వైరస్ అయితే.. పందుల్లో గుర్తించిన ఈ SADS-CoV ఆల్ఫా టైప్ వైరస్ అని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకితే శ్వాస వ్యవస్థలోని లంగ్స్‌తో పాటు లివర్, కడుపులోని కణాలపైనా దీని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఈ వైరస్ అధికంగా పేగుల్లోనే వృద్ధి చెందుతున్నట్లు గుర్తించారు. దీంతో డయేరియా, వాంతులు వంటి తీవ్ర సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
ఈ వైరస్ తో మరింత ముప్పు..
ఈ వైరస్ విజృంభిస్తే మానవాళికి మరింత ముప్పు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ వైరస్ మళ్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ శ్వాస వ్యవస్థపైనే ప్రభావం చూపితే.. ఈ కొత్తరకం వైరస్ మన జీర్ణవ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. పందులను పెంచే వారు, అక్కడ పని చేసే వారు, పంది మాంసం ప్రాసెసింగ్ లో పని చేసే వారు జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
Published by:Nikhil Kumar S
First published:October 15, 2020, 15:22 IST