కరోనా కట్టడికి కమాండోల మోహరింపు.. అక్కడ ప్రతి ఆరుగురిలో ఒకరికి వైరస్

పుంథూరా ప్రాంతంలో కరోనా కట్టడికి కమాండోలు మోహరించారు. స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీస్‌ (SAP)కు చెందిన 25 మంది కమాండోలతో అక్కడ పహారా కాస్తున్నారు.

news18-telugu
Updated: July 9, 2020, 7:52 AM IST
కరోనా కట్టడికి కమాండోల మోహరింపు.. అక్కడ ప్రతి ఆరుగురిలో ఒకరికి వైరస్
పుంథూరా ప్రాంతంలో కరోనా కట్టడికి కమాండోలు మోహరించారు. స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీస్‌ (SAP)కు చెందిన 25 మంది కమాండోలతో అక్కడ పహారా కాస్తున్నారు.
  • Share this:
పుంథూరా..! కేరళలో ఈ ప్రాంతం హాట్‌టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చించుకుంటున్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉండే పుంథూరాలో కొన్ని రోజులుగా పెద్ద మొత్తంలో కరోనా కేసులు బయటపడుతున్నాయి. గడిచిన 5 రోజుల్లో ఈ ప్రాంతంలో 600 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ఏకంగా 119 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అంటే ప్రతి ఆరుగురికిలో ఒకరికి కరోనా వైరస్ సోకిందన్నమాట..! ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చిన ఓ వ్యక్తి ఏకంగా 120 మందిని కలవడంతో.. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

ఈ క్రమంలో కరోనా కట్టడికి కఠినమైన చర్యలకు ఉపక్రమించింది. పుంథూరా ప్రాంతంలో కమాండోలు మోహరించారు. స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీస్‌ (SAP)కు చెందిన 25 మంది కమాండోలతో అక్కడ పహారా కాస్తున్నారు. SAP కమాండెంట్ ఇన్‌చార్జ్ ఎల్.సొలోమన్ స్థానిక మత గురువులతో సమావేశమై కరోనా గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ప్రస్తుతం పుంథూరా నుంచి బయటకు, బయటి నుంచి లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. ఈ ప్రాంతంలో ఉన్న మూడు వార్డుల ప్రజలకు 5 కేజీల బియ్యాన్ని ఉచితగా పంపిణీ చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత ఎక్కువ మందికి కరోనా పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


రాష్ట్రంలో పుంథూరా ప్రాంతం కరోనా సూపర్ స్ప్రెడర్‌గా మారిందని దేవస్వం, పర్యాటకమంత్రి కాదకంపల్లి సురేంద్రన్ అన్నారు. ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు వస్తున్న ప్రాంతం రాష్ట్రంలో మరెక్కడా లేదని ఆయన తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్రాష్ట్ర ప్రయాణాలకు బ్రేక్‌లు వేశారు. తిరువనంతపురం నుంచి తమిళనాడులోని కన్యాకుమారికి బస్సు సర్వీసులను నిలిపివేశారు. అంతేకాదు పుంథూరా, తమిళనాడు మధ్య ఫిషింగ్ బోట్ల రాకపోకలను కూడా నిలిపివేయాలని కోస్టల్ సెక్యూరిటీ, మెరైన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను డీజీపీ ఆదేశించారు.

కాగా, కేరళలో ఇప్పటి వరకు 6,195 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 3,559 మంది కోలుకొని ఆస్పత్రుల నుండి డిశ్చార్జి కాగా.. 27 మంది మరణించారు. ప్రస్తుతం కేరళలో 2605 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. బుధవారం ఏకంగా 301 కొత్త కేసులు రావడంతో.. కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడి దిశగా మరిన్ని చర్యలకు సిద్ధమవుతోంది.
Published by: Shiva Kumar Addula
First published: July 9, 2020, 7:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading